ప్రజాశక్తి - కాళ్ల
గ్రామాల్లో ప్రతి ఒక్కరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. గురువారం బొండాడపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పివిఎల్ నరసింహరాజు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలని ప్రతి మారుమూల గ్రామానికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో జగన్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. బిపి, మధుమేహం, ఇతర జబ్బులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సోమేశ్వరరావు, సిసలి వైసిపి నాయకులు రాంబాబు, కాళ్ల సర్పంచి బందా విజయ, బొండాడపేట సర్పంచి వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.
మొగల్తూరు : గ్రామాలలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్నామని చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మొగల్తూరులోని కుక్కలవారితోటలోని మూడో సచివాలయం వద్ద ఫామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇంటింటికీ వైద్యం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. పిహెచ్‌సి వైద్యులు దినేష్ కుమార్, వైద్య సిబ్బంది ప్రసాద్‌రాజు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ, ఉప సర్పంచి బోణం నరసింహారావు పాల్గొన్నారు.
గణపవరం : సామాన్యులకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో రెండో సచివాలయం వద్ద ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నెలకు రెండు రోజులు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో 67 రకాల మందులు, 14 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో పిహెచ్‌సి డాక్టర్లు పి.సంతోష్‌నాయుడు, పి.కిరణ్మయి, సిహెచ్‌ఒ జాలాది విల్సన్ బాబు పాల్గొన్నారు.
పాలకోడేరు : ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో మేలైన వైద్యం అందుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) తెలిపారు. కుముదవల్లిలో గురువారం పాలకోడేరు పిహెచ్‌సి డాక్టర్ స్వర్ణ నిరంజని ఆధ్వర్యంలో సర్పంచి భూపతిరాజు వంశీకృష్ణంరాజు అధ్యక్షతన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించింది. ఎపిజెషన్ క్యాంపును ఎంపిపి సత్య నారాయణ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. నెలకు రెండుసార్లు వైద్యులు గ్రామంలోనే ఉంటూ వారికి అన్ని రకాల వైద్యం అందిస్తూనే ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. డాక్టర్ స్వర్ణ నిరంజని మాట్లాడారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ సత్యనారాయణ, పిహెచ్‌ఎన్ కుమారి, సూపర్‌వైజర్లు శంకర్, శ్రీనివాస్, నాగమణి పాల్గొన్నారు.










