
ప్రజాశక్తి - కోటబొమ్మాళి: మూడు రోజుల పాటు నిర్వహించే కొత్తమ్మతల్లి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు సుసరాపు గణపతిశర్మ పూర్ణకుంభంతో వారిని ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దంపతులు, వైసిపి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, ఎంపిపి రోణంకి ఉమామహేశ్వరరావు, జెడ్‌పిటిసి దుబ్బ వెంకటరావుతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచీ యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాలకు వచ్చే యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు స్థానిక విద్యుత్‌నగర్ వాసులు ఉచితంగా వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
అమ్మవారి జంగిడికి ప్రత్యేక పూజలు
ఆలయంలో ఉన్న అమ్మవారి జంగిడిని అసాదీల కుటుంబీకుల పెద్ద తలపై పెట్టుకొని తల్లికి నిలయమైన రెడ్డిక వీధికి చెందిన కమ్మకట్టు చిన్నఅప్పలనాయుడు ఇంటి వరకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. జంగిడిని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రెడ్డిక వీధి నుంచి కలశాలతో ఊరేగింపుగా కొత్తమ్మతల్లి ఆలయానికి తీసుకొస్తారు.
ఇఒపై వైసిపి నాయకుల దురుసు ప్రవర్తన
కొత్తమ్మతల్లి ఆలయ ఇఒ రాధాకృష్ణపై వైసిపి నాయకులు దురుసుగా ప్రవర్తించారు. ఉత్సవాలను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉదయం ఏడు గంటలకు ప్రారంభించాల్సి ఉండగా వారు ఆలస్యంగా వచ్చారు. షెడ్యూల్ సమయానికి వారు రాకపోవడంతో ఎనిమిది గంటలకు పట్టువస్త్రాలతో వచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పట్టువస్త్రాలు సమర్పించేందుకు రావడంతో ఆలయ అధికారులు వారిని స్వాగతించారు. వారు పూజలు చేసి వెనుదిరుగుతున్న సమయంలో వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి, ఇతర వైసిపి నాయకులు వచ్చారు. ప్రోటోకాల్ పాటించకుండా ప్రతిపక్ష నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారని దువ్వాడ వాణి అనుచరులు ఇఒపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాల నిర్వహణ ఇలాగే చేస్తారా అని మండిపడ్డారు. అచ్చెన్నాయుడును ముందుగా ఎలా స్వాగతిస్తారంటూ ఇఒను నెట్టేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇఒకు రక్షణగా నిలిచారు. వైసిపి నాయకులకు ఆలయ అధికారులు, పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు.