Nov 01,2023 00:05

అధికారులను నిలదీస్తున్న బాబూరావు

* మున్సిపల్‌ సమావేశంలో కౌన్సిలర్ల నిలదీత
ప్రజాశక్తి- పలాస:
 గత సమావేశంలో వాయిదా పడిన అంశం తరువాత జరిగిన సమావేశంలో అజెండాలో పెట్టకపోవడం తీవ్రమైన తప్పిదమని మున్సిపల్‌ కౌన్సిలర్లు దువ్వాడ శ్రీకాంత్‌, వజ్జ బాబూరావులు చైర్మన్‌, అధికారులకు నిలదీశారు. పలాస మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం చైర్మన్‌ బల్ల గిరిబాబు అధ్యక్షత మున్సిపల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌ మాట్లాడుతూ గత సమావేశంలో 311 దుకాణాల లైసెన్స్లను రద్దు చేస్తున్నామనే అంశం వాయిదా పడిందని, దానిని మరోమారు చర్చించేందుకు నేడు సమావేశంలో మొదటిగా అజెండాలో ఎందుకు పొందు పర్చలేదని అధికారులను నిలదీశారు. కెటిరోడ్‌ అభివృద్ధి పనులకు ఎలా వినియోగిస్తున్నారని నిలదీశారు. దీనిపై కౌన్సిలర్‌ వజ్జ బాబూరావు కలుగజేసుకొని ఆ అంశం అజెండాలో మెదటిగా ఉండాలని, కమిషనర్‌ దానిని చూసుకోవాల్సి ఉందని, దీనివలన భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులతో పాటు కౌన్సిల్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. దీనిపై చైర్మన్‌ గిరిబాబు మాట్లాడుతూ తప్పిదం జరిగిన మాట వాస్తవేమని, అయితే దుకాణాలు లైసెన్స్‌ రద్దు చేయకుండా వాటిపై రెన్యూవల్‌ చేసుకునే చర్యలు చేపడుతున్నామని అన్నారు. చైర్మన్‌, కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌లు మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో ఖర్చుచేయకపోవడంతో ఆ నిధులు అభివృద్ధి పనులకు వినియోగించుకుంటామని ఉన్నతాధికారుకు కోరామని, దీంతో వారు వినియోగించు కోవాలని చెప్పడంతో రూ.8 కోట్ల నిధులు ఉండగా ఉద్యోగుల జీతాలు, విద్యుత్‌ చార్జీలకు మూడు నెలలలకు సరిపడే నిధులు ఉంచుకొని కెటిరోడ్‌ అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కో-ఆప్షన్‌ సభ్యులు బమ్మిడి సంతోష్‌, కౌన్సిలర్లు గురిటి సూర్యనారాయణ, దుర్గా శంకర్‌ పాండామాట్లాడుతూ ముత్యాలమ్మకోనేరు (నెహ్రు పార్కు)కు ఇప్పటికే రూ.50 లక్షలు ఖర్చు చేశారని అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, నెహ్రు పార్కులో అభివృద్ధి పనులు చేపట్టి సుందరంగా తయారు చేయాలని కోరారు. కమిషనర్‌ టి.నాగేంద్రబాబు మాట్లాడుతూ అమృత్‌ 2.20 అనే కేంద్ర పథకం ద్వారా మున్సిపాలిటీలో ఉన్న చెరువులు అన్నింటిని కేంద్ర ప్రభుత్వ నిధులు ద్వారా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు బోర బుజ్జి. మీసాల సురేష్‌ బాబు, కౌన్సిలర్లు బల్ల రేవతి, శర్వాన గీత, పోతనపల్లి ఉమ, బోర చంద్రకళ, తంగుల శాలత, జోగ త్రివేణి. గుజ్జు జోగారావు, కౌన్సిలర్‌ కర్రి మాధవరావు, పిచ్చుక అజరు. సనపల సింహాచలం ఉన్నారు.