Apr 01,2023 22:41

సాహిత్య సదస్సులో మాట్లాడుతున్న వక్తలు

ప్రజాశక్తి-అనంతపురం       వాస్తవిక కథల సేద్యగాడు సింగమనేని అని, అనంత రైతు పక్షాన నిలిచిన గొప్ప సాహితీవేత్త అని, కరువు నేలలో దగా పడుతున్న రైతుల యదార్థ దృశ్యాన్ని తెలుగు సాహితీ లోకానికి అందించిన గొప్ప మేధావి సింగమనేని నారాయణ అని వక్తలు కొనియాడారు. సింగమనేని నారాయణ ద్వితీయ వర్థంతి సందర్భంగా నగరంలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం సాహితీ సదస్సు నిర్వహించారు. సదస్సుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్‌రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. సింగమనేని కథల నిండా అనంత రైతుల జీవితాలు, మధ్యతరగతి ప్రజల మనస్తత్వాలు, బడుగు బలహీన వర్గాల జీవితాలు ప్రతిబింబిస్తాయని అన్నారు. ప్రతి రచన తన అనుభవంతో రాశాడన్నారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జి.బాలసుబ్రమణ్యం ప్రసంగిస్తూ సింగమనేని నిబద్ధత కలిగిన రచయిత అన్నారు. మార్క్సిజం దృష్టి కోణంతో సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు. ఆర్ట్స్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రంగస్వామి ప్రసంగిస్తూ సింగమనేని నారాయణ అనంత ఆణిముత్యమని, తాను చెప్పే సిద్ధాంతాలకు కట్టుబడి జీవించడం, రచనలు చేయడం రెండూ ఒకే సమయంలో చేశారన్నారు. పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధర్మపురి వెంకటేష్‌ ప్రసంగిస్తూ జూదం, అడుసు, ఒక పయనం, కొత్త అల్లుడు, తరగతి గదిలో తల్లి, లాంటి గొప్ప కథలు ఆయనకు కీర్తి తెచ్చాయన్నారు. జాషువా సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి హెచ్‌ నాగలింగయ్య ప్రసంగిస్తూ సింగమనేని జీవితం భవిష్యత్‌ తరాల వారికి తెలియజేయడానికే ఇలాంటి సాహిత్య సభలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి సింగమనేని కథల పుస్తకాలు బహుమతులుగా అందిస్తున్నామన్నారు. డాక్టర్‌ నానీల నాగేంద్ర మాట్లాడుతూ సింగమనేని ఆధునిక దృష్టి కోణం గల రచయిత అన్నారు. తెలుగు పండితుడు రామశేషయ్య మాట్లాడుతూ సింగమనేని అనంత సాహిత్యాన్ని భుజాలకి ఎత్తుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం విద్యార్థులకు సింగమనేని నారాయణ జీవితం సాహిత్యం అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు సింగమనేని కథల పుస్తకాలను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో మిద్దె మురళీకృష్ణ, సాయప్ప, వేలాంగిని, మధుర శ్రీ, పూజారి ఈరన్న, షేక్‌ రియాజుద్దీన్‌ అహ్మద్‌, టీవీ రెడ్డి, నాగమణి, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.