Oct 26,2023 22:04

మాట్లాడుతున్న సత్యనారాయణ, అప్పలరాజు

* ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్తాం
* వైసిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌, మంత్రి బొత్స సత్యనారాయణ
* టిడిపి హయాంలోనే వలసలు : మంత్రి ధర్మాన
* వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, కవిటి, పలాస : 
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు వివరించేందుకే సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టామని వైసిపి రీజనల్‌ కో ఆర్డినేటర్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైసిపి కార్యాలయంలో బస్సు యాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో, పలాసలో మేధావులతో ముఖాముఖి, ఇచ్ఛాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అవినీతిలో కూరుకుపోయిన టిడిపికి కొందరు వత్తాసు పలుకుతున్నారన్నారు. నిజానిజాలు బట్టబయలు చేసి ప్రజలకు వివరిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా చూశామని చెప్పారు. రాబోయే కాలంలో ఆయా తరగతులకు ఏవిధంగా న్యాయం చేస్తామో తెలియజేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉద్దాన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, కిడ్నీ ఆస్పత్రిని మంజూరు చేశారని చెప్పారు.
టిడిపి హయాంలోనే వలసలు : ధర్మాన
       టిడిపి ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా, జిల్లా నుంచి వలసలు మాత్రం పెరిగాయని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా జిల్లావాసులే కనబడేవారని, ఇప్పుడా పరిస్థితి మారిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్ఛాపురం నియోజకవర్గానికి జెడ్‌పి చైర్‌పర్సన్‌, ఎమ్మెల్సీ, అనేక కార్పొరేషన్‌ పదవులు కేటాయించి ఏ నియోజకవర్గానికి ఇవ్వని ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అందుకు కృతజ్ఞతగా వచ్చే ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో వైసిపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వైసిపి ప్రభుత్వం అవినీతికి తావులేకుండా పేదరికమే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. కరెంట్‌ ఛార్జీలు, ఉల్లి ధరలు పెరిగాయంటూ టిడిపి నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని... దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయన్నారు.
అభివృద్ధే లక్ష్యం : మంత్రి అప్పలరాజు
రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడమే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస నియోజకవర్గంలో రూ.700 కోట్లతో మంచినీటి పథకం, కిడ్నీ ఆస్పత్రి నిర్మాణం, సచివాలయాలు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
పేదలకు అండగా ఉన్నందుకు ఓడించాలా?
టిడిపి నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తున్నారని, వైసిపి ప్రభుత్వం పేదలకు అండగా ఉన్నందుకు ఓడించాలా అని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ప్రశ్నించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు.
దళితుల అభివృద్ధికి బాటలు
దేశ చరిత్రలోనే సామాజిక విప్లవానికి తెరతీసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. టిడిపి హయాంలో దళితులపై దాడులు, చివరికి అంబేద్కర్‌ విగ్రహం పెట్టేందుకూ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. దళితులు తలెత్తుకు తిరిగేలా వైసిపి ప్రభుత్వం బాటలు వేసిందన్నారు.
జిల్లాకు చేసింది శూన్యం
ఎప్పుడో బ్రిటిష్‌ వాళ్లు వేసిన రైల్వే ట్రాక్‌ తానే వేయించానని, ప్రభుత్వం విడుదల చేస్తున్న జిఒలు తనవల్లే అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు గొప్పలు చెప్పుకోవడం తప్ప జిల్లాకు చేసింది శూన్యమని నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ విమర్శించారు. ఇచ్ఛాపురం నుంచి రెండుసార్లు గెలిచినా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.
పలుచోట్ల ఘన స్వాగతం
వైసిపి నేతలు చేపట్టిన బస్సు యాత్రకు పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నరసన్నపేట, కోటబొమ్మాళి ప్రాంతాల్లో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు, మహిళలు నిల్చొని స్వాగతం పలికారు. కాశీబుగ్గ కోసంగిపురం జంక్షన్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. యాత్రకు మద్దతుగా పలుచోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.
జనం ఇక్కట్లు
ఇచ్ఛాపురంలో ప్రధాన రహదారిపైనే సభ నిర్వహించడంతో జనం ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్‌ దగ్గర సభాస్థలి ఏర్పాటు చేయడంతో ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. దీంతో లగేజీలతో నడవలేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చిన్నారులు, వృద్ధులు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభకు పెద్దఎత్తున డ్వాక్రా మహిళలను తరలించారు.
కార్యక్రమంలో వైసిపి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, నర్తు రామారావు, పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్యే వి.కళావతి, పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ చైర్మన్‌ బి.గిరిబాబు, యూత్‌ వింగ్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి ఎ.సత్యనారాయణ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.