ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని వారతిప్ప గ్రామంలో గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని కొంత మంది గ్రామస్తులు కబ్జా చేస్తుండటంతో బుధవారం సాయంత్రం గ్రామస్తులు, ఆ గ్రామ మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి గురుకుల పాఠశాల మంజూరైంది. ఈ నేపథ్యంలో వారతిప్పలో పాఠశాలను ఆర్‌ఎస్ నంబర్ 70లో సుమారు 5 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. పలువురు ఆక్రమణదారులు ఆస్థలంలో మూడు రోజుల క్రితమే షెడ్లు, కుళాయి పైప్ లైన్ వేసి, బుధవారం మొక్కలు నాటుతుండడంతో గుర్తించిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు పనులను అడ్డుకున్నారు. తమ గ్రామంలో గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు కేటాయించిన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని గ్రామస్తులు రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపతామని రెవెన్యూ అధికారులు తెలిపారు.










