Apr 18,2023 21:33

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఇంటాక్‌ అనంతపురం చాప్టర్‌ కన్వీనర్‌ రామ్‌కుమార్‌

         ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, నిర్మాణాలను పదిలంగా కాపాడుకుందామని ఆర్ట్స్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ శశాకమౌళి, పురావస్తు శాఖ సంచాలకులు రజిత, ఇంటాక్‌ అనంతపురం చాప్టర్‌ కన్వీనర్‌ రామ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, భారత జాతీయ కళలు వారసత్వ సంపదల సంస్థలు సంయుక్తంగా వారసత్వ సంపదపై చిత్ర ప్రదర్శన, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ప్రదర్శనను పురావస్తు శాఖ సహాయ సంచాలకులు రజిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం సుసంపన్నమైన, బహువిధమైన వారసత్వ సంపద కలిగి ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమైన దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విధానాన్ని గౌరవించి ఆచరించే విధంగా ప్రాథమిక హక్కులు, బాధ్యతలు ప్రసాధిచారని తెలిపారు. అందుకు అనుగుణంగా వాటిని కాపాడుకుంటూ మనమందరం నడచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్‌ రమేష్‌ నారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రియాజుద్దీన్‌, ఇంటాక్‌ జీవితకాల సభ్యులు నబిరసూల్‌, సూర్యనారాయణరెడ్డి, సాధు శేఖర్‌, బాలన్న, కళాశాల లెక్చరర్లు నాగభూషణం, పద్మావతి, అనంతరెడ్డి, నాగభూషణం విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ర్యాలీ
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనల శాలల శాఖ ఆధ్వర్యలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. క్లాక్‌టవర్‌ నుంచి పీస్‌ మెమోరియల్‌ హాల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు వి.రజిత, పర్యాటక శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.