Jun 01,2023 09:20

విలేకరులతో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్ర కుమార్‌

            అనంతపురం కలెక్టరేట్‌:జిల్లా వ్యాప్తంగా అనంత కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న వార్డు శానిటేషన్‌ కార్యదర్శులకు పని భారం తగ్గించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వర్తింప చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగబూషణం డిమాండ్‌ చేశారు. బుధవారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో పని చేస్తున్న శానిటేషన్‌ కార్యదర్శులకు పని భారం పెరిగి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వీరిపై పని భారం తగ్గించాల్సి ఉందన్నారు. జాబ్‌చార్ట్‌లో లేని పనులనూ వారితో చేయించుకుంటున్నారని చెప్పారు. దీంతో చాలా మంది ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముగ్గురు శానిటేషన్‌ కార్యదర్శులు మృతి చెందారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లాప్‌ కార్యక్రమంలో యూజర్‌ ఛార్జీలు వసూళ్ల బాధ్యత కూడా వీరిపై ఉంచడంతో పాటు దినసరి వసూళ్ల టార్గెట్‌ విధిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి వార్డు శానిటేషన్‌ సెక్రటరీలపై పని భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగులు కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.