Jun 29,2023 22:16

వర్షం

       అనంతపురం : ఆ సారి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే వర్షాలు బాగా కురుస్తాయని, రుతుపవనాలు కూడా ముందుగానే వస్తాయని వాతవరణ శాస్త్రవేత్తలు చెప్పారు. రైతులు కూడా వర్షం, పంట సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. జూన్‌ నెల ముగిసినా ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెప్పుకోదగ్గ పెద్ద వాన ఒక్కసారి కూడా పడలేదు. ఆరు మండలాలు మినహాయించి మిగిలిన చోట కనీసం భూమి తడిసేంత వాన కూడా లేదు. గత 10 రోజులుగా రోజూ ఆకాశం మేఘామృతం కావడం.. తరువాత గాలులు మొదలవడం.. వర్షం రాకుండా పోవడం జరుగుతోంది. ఖరీఫ్‌ పంట సాగుకు సమయం ముగిస్తున్నా చినుకు జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు. వేసిన కొద్దిపాటి పంట కూడా వర్షం రాకపోవడంతో ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
జూన్‌ 2వ వారం రాగానే రుతు పవనాలు ప్రవేశించి వర్షాలు పడుతాయి. ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి లేదు. వానాకాలం ప్రారంభం అయ్యి నెల రోజులు పూర్తయినా ఇప్పటికీ చెప్పుకోదగ్గ వర్షం ఒక్క రోజు కూడా పడలేదు. గత వారం రోజులు వరకు కూడా ఎండవేడిమితో జనం ఇబ్బంది పడ్డారు. వారం రోజుల నుంచి రుతపవనాలు దోబూచులాడడం తప్పా చినుకు రూపంలో కిందకు దిగిందిలేదు. ఉమ్మడి జిల్లాలో ఈ పాటికే వేరుశనగ, కంది పంటల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సరైన వర్షం లేకపోవడంతో పూర్తి స్థాయిలో వ్యవసాయ పనులు మొదలు కాలేదు. బోరుబావుల్లో నీరున్న రైతులు అడపాదడపా పంటలు సాగు చేస్తుండగా, వర్షాధార పంటల పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో మొదలు కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా జిల్లా ప్రధాన పంట అయిన వేరుశనగ సాగు పూర్తిగా తగ్గింది. సాధారణ వర్షం పాతం నమోదు కావడంతో చాలా మంది వేరుశనగను వదిలేసి ఆముదం, పత్తి సాగు వైపు వెళ్తున్నారు. వీటికైతే వర్షం తక్కువగా ఉన్నా సరిపోతోందన్న భావన రైతుల్లో కన్పిస్తోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు వర్షాభావ పరిస్థితులో ఉన్నాయి. గత వారం రోజుల క్రితం కదిరి, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి తదితర మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురసింది. ఇది కూడా పంటలు సాగు చేసేందుకు అవసరం అయ్యే వర్షం కాదు. మిగిలిన మండలాల్లో ఈపాటి వర్షాలు కూడా ఇప్పటి వరకూ కురవలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరాసరి 5 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదవని పరిస్థితి ఉంది. గత వారంలో రుతపవనాలు ప్రవేశించాయని వర్షాలు బాగా కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. అయితే రుతుపవనాలు ముందుకు కదలకపోవడంతో వర్షాలు కరవలేదు. ప్రస్తుతం రుతుపవనాలు వచ్చే అవకాశం కూడా కన్పించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
పంట సాగుపై ఆందోళన
చినుకుజాడ లేకపోవడంతో పంట సాగుపై రైతుల్లో ఆందోళన కన్పిస్తోంది. ఇప్పటికే వరుస కరువులతో పంట నష్టాన్ని చవిచూసిన అన్నదాతలకు ఈ ఏడాది ఆదిలోనే వర్షాభావ పరిస్థితులు కన్పిస్తుండడంతో పంట సాగుపై ధైర్యం చేయలేకపోతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 9.31 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇందులో ఇరవై శాతం కూడా సాగవని పరిస్థితి ఉంది. అత్యధికంగా సాగయ్యే వేరుశనగ కూడా అంతంత మాత్రంగానే విత్తనం పడింది. రోహిణి, మృగశిర కార్తెలు ఇప్పటికే ముగిశాయి. మరికొద్ది రోజుల్లో ఆరుద్ర కార్తె కూడా పోతోంది. ఈ కార్తెల్లో విత్తనాలు వేస్తే పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తుంటారు. అలాంటిది వర్షం లేకపోవడంతో రైతులు విత్తనాలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వర్షం ఇలా దోబుచులాడుతున్న సమయంలో వేరుశనగ, కంది, తదితర పంటల విత్తనాలు వేయాలా.. వద్దా.. అన్న మీమాంశలో రైతులు ఉన్నారు. వర్షం మరికొంత ఆలస్యం అయితే చిరుధాన్యాల సాగు చేయడమే మేలన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. ఏది ఏమైనా ఈ వారం రోజుల్లో బలమైన వర్షం పడి పంట సాగు చేసుకునేందుకు వీలుకలుగుతుందనే ఆశతో రైతులు ఉన్నారు.