Jul 13,2023 17:40

అధ్వానంగా పెనుమంచిలి, వర్థనపు గరువు రహదారి
ప్రజల అవస్థలు
ప్రజాశక్తి - ఆచంట
మండలంలో కురుస్తున్న వర్షాలకు పెనుమంచిలి పంచాయతీ పరిధి వర్థనపు గురువు, రొక్కాల గురువు రహదారి నడవడానికి వీల్లేకుండా అధ్వానంగా తయారైంది. దీంతో ఆయా ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతూనే ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తూ కాలం గడుపుతున్నారని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్‌ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి రహదారి పూర్తిగా బురదమయంగా తయారైందని, నడవడానికి వీల్లేకుండా ఉందని, పాదచారులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. తక్షణం ఆచంట నియోజకవర్గ ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అధికారులు స్పందించి దళితవాడల్లోని రహదారులకు నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని లేనిపక్షంలో దళితులను సమీకరించి ధర్నా చేస్తామని హెచ్చరించారు.