Jun 07,2023 22:37

వాలంటీర్లను సత్కరిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

            ఆత్మకూరు : వైసిపి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు ఆత్మకూరులో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కోవడంలో వాలంటీర్ల పాత్ర ఆమోఘమని కొనియాడారు. వాలంటీర్ల ద్వారా అన్ని సంక్షేమ పథకాలకు ఇంటింటికీ అందుతున్నాయని తెలియజేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాడు అపద్దాలు, మోసపు మాటలతో ప్రజల్ని మోసం చేశారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం 25 ఏళ్లు అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కనీసం పేరూరు డ్యాంకు నీరు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. మహిళా పాడి రైతుల కోసం తోపుదుర్తి సహకార డెయిరీని ఏర్పాటు చేశామని, ఈనెల 14న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దీనిని ప్రారంభిస్తామని చెప్పారు. ఆత్మకూరు మండలంలో ఎక్కువమంది పేదలకు ఇళ్లు మంజూరు చేయించి, నిర్మాణాలు పూర్తి చేయించే వాలంటీర్లకు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి కారును నజరానాగా ప్రకటించారు. ఇళ్ల మంజూరుకు సంబంధించి సచివాలయం పరిధిలో టాప్‌గా నిలిచిన వాలంటీరుకు రూ.50 వేలు, రెండోస్థానంలో నిలిచిన వాలంటీరుకు రూ.30 వేలు, మూడోస్థానంలో నిలిచిన వాలంటీరుకు రూ.20 వేలు ప్రోత్సహక బహుమతులు అందజేస్తానని ప్రకటించారు. అనంతరం పంపనూరులో ఉచిత బోర్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.