Jun 04,2023 21:39

ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి పురస్కాకరం అందజేస్తున్న వాల్మీకి నాయకులు

           ప్రజాశక్తి-అనంతపురం   వాల్మీకులు అన్నిరంగాల్లో రాణించానలి మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వాల్మీకి భవన్‌లో పది, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన వాల్మీకి విద్యార్థులకు సంఘం అధ్యక్షుడు అక్కులప్ప అధ్యక్షతన ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేక మంచి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే పది, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం సంతోషకరమన్నారు. ఇలాంటి పురస్కారాలను వాల్మీకి విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ గతంలో ఇలాంటి ప్రతిభ పురస్కారాలు నిర్వహించినప్పుడు వాల్మీకి కుటుంబ పిల్లలు చాలా తక్కువ మంది హాజరయ్యే వారన్నారు. అయితే నేడు వందల సంఖ్యలో వస్తున్నారంటే వాల్మీకి బిడ్డల భవిష్యత్తు మంచిమార్గంలో వెళ్తోందని అర్థం అవుతోందన్నారు. ఇది ఒక మంచి సంకేతం అన్నారు. కర్నూలు జిల్లా వాల్మీకి నాయకులు డాక్టర్‌ పార్థసారథి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వాల్మీకులు వెనుకబడి ఉన్నారన్నారు. ఆయా కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే వారి పిల్లల మంచి చదువులతో రాణించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు తమవంతు సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు ఆదినారాయణ, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ తలారి ఆదినారాయణ, అమరావతి ఆసుపత్రి ఎండి ముత్యాలన్న, ఎడిసిసి బ్యాంకు అధ్యక్షురాలు లిఖిత, మాజీ ఛైర్మన్‌ వీరాంజనేయులు, నాయకులు రామలింగయ్య, రవి, చంద్ర, ఓబుళపతి, శివయ్య, గంగాధర్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.