ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన బోయ, వాల్మీకి, బెంతో, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలోకి మార్చాలని కేంద్రానికి సిఫారసు చేయడం దుర్మార్గమనిూ ఆల్ ఇండియా బంజారా సేవాసంఫ్‌ు నేతలు అన్నారు. ఆయా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసి పార్లమెంట్‌కు పంపించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎఐబిఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐబిఎస్‌ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు సి.అశ్వర్థనాయక్, రాష్ట్ర నాయకులు బి.రంగానాయక్, ఎస్‌సి.బాలనాయక్, రంగ్లానాయక్, యువజన విభాగం అధ్యక్షులు రామాంజనేయులు, ఉపాధ్యక్షులు ప్రసాద్‌నాయక్ మాట్లాడుతూ గిరిజనులు దారిద్ర రేఖకు దిగువ నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఫలాలు అందుకుంటూ ముందుకొస్తున్న తరుణంలో ఎస్టీ జాబితాలోకి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన వారిని చేర్చడం అన్యాయంగా ఉందన్నారు. స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ గిరిజన తండాలకు రోడ్లు, నీటి సదుపాయం, విద్యా, వైద్య సదుపాయాలు లేవన్నారు. ఎస్టీ జాబితాలోని 33 ఉప కులాలు రిజర్వేషన్ ఫలాలు అందిపుచ్చుకుని కొంతమంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు పొంది మైదాన ప్రాంతాల్లో జీవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ కేరళ, ముంబై, బెంగళూరు రాష్ట్రాల్లో చాలామంది గిరిజనులు భిక్షం ఎత్తుకుని, పాచిపనులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా అభివృద్ధి చెందిన బోయ, వాల్మికి ఇతరులను చేర్చి గిరిజనులను మరింత వెనుకబాటుకు గురి చేయడమే అవుతుందన్నారు. తక్షణమే 52 జిఒను తక్షణమే రద్ధు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎమ్.గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐబిఎస్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుగుణబాయి, ప్రధాన కార్యదర్శి శివమణిబాయి, సుభ్యులు ఈశ్వరిబాయి, క్రిష్ణానాయక్, సేవాఘడ్ ట్రస్ట్ గురుమాల రాజేంద్రప్రసాద్, ఏఐబిఎస్‌ఎస్ జిల్లా కోశాధికారి నారాయణస్వామినాయక్, నాయకులు గోవిందు నాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పాల్గొన్న ఎఐబిఎస్‌ఎస్ నేతలు










