వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: శరీరంలోని అన్ని ఇంద్రియాల కన్నా కళ్లు అత్యంత ప్రధానమైనవని, వాటిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా రవాణా అధికారి బసిరెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం రవాణాశాఖ కార్యాలయంలో వివిధ రకాలైన వాహనాల యజమానులకు కంటిపరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులు అందించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నేడు వివిధ వాహనాల డ్రైవర్లకు కంటిపరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా రవాణాశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో వేలాది వాహనాలు ఉన్నాయని, తెల్లవారు జామున ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అందుకు కారణం నిద్ర తక్కువ కావడమే అని, కావలసినంత మేరకు నిద్రపోయి తర్వాత వాహనంలో ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల కాలంలో మంచు పెరగడంతో ప్రయాణించడం ప్రమాదాలకు కారణమవుతోందని అన్నారు. ప్రతి ఆరునెలలకు వాహనాలను డ్రైవింగ్ చేసే డ్రైవర్లు, 40సంవత్సరాలు పైబడిన వారు కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మధుసూదన్, రాజేశ్వరరావు, మురళి, వాసుదేవరెడ్డి, శివకుమార్, ఇస్మాయిల్ ఖాన్, శ్వేత, గాయత్రి, తిరుపతి నారాయణాద్రి హాస్పిటల్‌కు సంబంధించిన వైద్యులు వివిధ రకాల కంటిచికిత్సలు నిర్వహించి మందులు సరఫరా చేశారు.










