వాగులు, వంకల వద్ద గట్టి పర్యవేక్షణ : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: తుపాన్ నేపథ్యంలో ఈనెల 11వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాగులు, వంకలు, కాజ్‌వేల వద్ద నీటి ప్రవాహంను బట్టి రాకపోకలు జరగకుండా ముందస్తుచర్యలు చేపట్టాలన్నారు. అలాగే వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద నీటి ప్రవాహంకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ అవసరమని ఏపీఎస్పీడీసీ ఎల్‌అధికారులు అప్రమత్తంగా ఉండి లైన్లు కట్ అయిన చోట వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు.
కాజువేల వద్ద అత్యంత జాగ్రత్త :జెసి
జిల్లాలో తుపాను నేపథ్యంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని తగిన భద్రతాచర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. శనివారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ జిల్లాలోని అందరూ ఎంపీడీఓలు, తహాశీల్డార్లుతో టెలికాన్ఫరన్స్ నిర్వహించారు. జెసి మాట్లాడుతూ తుపాన్ ప్రభావం మరో 24గంటలు కొనసాగే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో కలసి పనిచేసి ఎటువంటి నష్టం కలుగకుండా చూడాలన్నారు. నదులు, చెరువులు, కాజువేల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని 31 మండలాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్టీఆర్ జలాశయం, నీవానదిని పరిశీలించిన కలెక్టర్
చిత్తూరు నగరపరిధిలోని నీవానది నీటిఉధతిని, పెనుమూరు ఎన్టీఆర్ జలాశయంను జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ పరిశీలించారు. తుపాన్ నేపథ్యంలో చిత్తూరు తేనెబండ, సంతపేట వద్ద నీవానది పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నీటి ప్రవాహా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కల్వర్టు వద్ద మునిసిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. నీటి ప్రవాహనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చెత్త, ఇతరవ్యర్ధాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. నీవా నది పరిసరప్రాంతప్రజలనుసురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎన్టీఆర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 110 ఎంసిఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం 88 ఎంసిఎఫ్‌టి వరకు కలదని ఇరిగేషన్ ఎస్‌ఈ విజరు కుమార్ రెడ్డి కలెక్టర్ వివరించారు. అనంతరం పి. కొత్తకోట చవటపల్లి బ్రిడ్జి క్రింద నీరు నిల్వ ఉండడంతో ఆప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ వాహనదారులు, ప్రజలు ఎవ్వరూ ఆ దారిలో వెళ్లకుండా ప్రమాద సూచికలను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు గా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కమిషనర్ విస్తత పర్యటన
లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్ష - అధికారులకు మార్గనిర్దేశం
తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాలు, వీస్తున్న గాలుల నేపథ్యంలో నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ శనివారం ఉదయం నగరంలో విస్తతంగా పర్యటించారు. ఈదురు గాలులు, జోరు వర్షంలోనే కమిషనర్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గాలులు, వర్షాలతో ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తిన సత్వరం స్పందించి పరిస్థితులను చక్కదిద్దాలని నగరపాలక అధికారులను ఆదేశించారు. తొమ్మిదో వార్డు పరిధిలో చెన్నారెడ్డి కాలనీలో రోడ్డుపై చెట్టు కూలడంతో నగరపాలక అధికారులు, రెస్క్యూ సిబ్బంది సత్వరం స్పందించి తొలగించారు. కమిషనర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. నగరంలో లోతట్టు, ముంపు ప్రాంతమైన వీరభద్రకాలనీల్లో పరిస్థితిని పరిశీలించారు. నీవానదిలో నీటిమట్టంపై ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ ఇరువారం వద్ద నీవానదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నగర పాలక పరిధిలో అన్ని వార్డు సచివాలయంలో పరిధిలో వార్డు కార్యదర్శులు వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గంగవరం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో జనజీవనం స్తంభిస్తోంది. మూగ జీవాలు కొట్టాలకే పరిమితమయ్యాయి. పాడి రైతులు పశువులకు మేత తీసుకురావడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పూర్తిగా నీటిపాలవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
కార్వేటినగరం మండలంలో విస్తారంగా వర్షాలు పడటంతో వాగులు పొంగాయి దీంతో పంటలు మునిపోయాయి. కొటార్వేడు పరిసర ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన మిరప పంట, సీడీ కండిగ, కోదండరామాపురం, టీకేఎంపేట, యర్రమరాజుపల్లి, గాజంకె గ్రామాల్లో వేరుశెనగ పంట నీటి మునిగింది.
బైరెడ్డిపల్లి మండలంలోని భారీ వర్షం కారణంగా బేలుపల్లి పంచాయతీ పరిధిలోని రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి.
శాంతిపురం మండలంలోని వ్యవసాయ క్షేత్రాలలో తుపాన్ కారణంగా 60 రోజుల పైబడిన దశలో ఉన్న మొక్కజొన్న గాలివాన వలన దాదాపు 10ఎకరాల్లో నీటిమునిగింది. కొలమడుగు ఒక ఎకరా వరి పూర్తిగా నీటమునిగింది. అలాగే కూరగాయల పంటలు, సొర, బీర పంటలకు కూడా తీవ్రనష్టం కలిగింది.
పూతలపట్టు మండలంలోని పి. కొత్తకోట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కొత్తగా నిర్మించిన 6 లైన్ 140 జాతీయ రహదారిలో సర్వీస్ రోడ్డులో నిల్వచేరిన వర్షపు నీటిలో టాటా ఏసీ మినీ వాహనం చిక్కుకుంది. స్థలాన్ని చేరుకున్న కలెక్టర్ హరినారాయణ, ఆర్డీఓ రేణుక, తహశీల్దార్ విజరు భాస్కర్ వర్షపు నీటిలో చిక్కుకున్న టాటా మినీ వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు
.










