
* అభివృద్ధికి దోహదపడుతున్న ఉక్కును అమ్మేస్తున్నారు
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం ధ్వజం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, యంత్రాంగం: విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయడం ద్వారా మోడీ ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన ఉక్కు రక్షణ బైక్ యాత్ర జిల్లాలో మూడో రోజైన శనివారం కొనసాగింది. ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతున్న స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని చూడటం దారుణమన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఉత్తరాంధ్ర అభివద్ధి చెందుతుందని, లేకుంటే మరింత వెనుక బడుతుందని చెప్పారు. రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక పరిశ్రమ విశాఖ స్టీల్ అని చెప్పారు. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు అదానీ పక్షమా? ఆంధ్రప్రదేశ్ పక్షమా చెప్పాలన్నారు. తెలుగు ప్రజలు పోరాడి 32 మంది ప్రాణత్యాగాలతో, 16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా సాధించుకున్న ఈ ప్లాంట్‌ను ప్రజల సహకారంతో రక్షించకుంటామని చెప్పారు. ఉత్పత్తిని ఏకపక్షంగా తగ్గించి వేసింది. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ను నిలిపివేసింది. ఉన్నత స్థాయి అధికారులతో సహా అనేక ఖాళీలను నింపడం లేదు. రోజువారీ పనులకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కూడా లేకుండా చేస్తోందని విమర్శించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్ మాట్లాడుతూ దేశంలోని ప్రైవేట్ రంగంతో సహా అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత ముడి సరుకులను, గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు మాత్రం సొంతగనులు కేటాయించేందుకు నిరాకరిస్తోందని ధ్వజమెత్తారు. స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు
ఇచ్ఛాపురంలో...
ఇచ్ఛాపురం చేరుకున్న బైక్ యాత్రకు సిపిఎం, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఇచ్ఛాపురం బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథంతోపాటు నాయకులు మాట్లాడారు.
కంచిలిలో...
కంచిలికి చేరుకున్న బైక్ యాత్రకు కంచిలి మండల పార్టీ, ప్రజా, కార్మిక, రైతు సంఘాల నాయకులు కప్ప గోపీనాథ్, పిట్ట కష్ణ, రఘు, స్వాగతం పలికారు. కంచిలిలో నిర్వహించిన సభకు కంచిలి వైసిపి జడ్‌పిటిసి ప్రతినిధి ఇప్పిలి కష్ణారావు సభకు హాజరై సంఘీభావం తెలిపారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఆంధ్ర ఉక్కు కర్మగారాన్ని ప్రైవేటుపరం కానీయ కూడదన్నారు. అన్ని పార్టీలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు
సోంపేటలో
సోంపేటకు చేరుకున్న బైక్ యాత్రకు మండల పార్టీ, ప్రజా, కార్మిక, రైతు సంఘాల నాయకులు సంగారు లక్ష్మీనారాయణ, జుత్తు సింహాచలం, వల్లభరావు, రాజు, కర్రి సింహాచలం, మన్మధరావు, టి.పాపారావు, యామయ్య తదితరులు స్వాగతం పలికారు. సోంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని పర్యవరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ వై.కృష్ణమూర్తి సంఘీభావం తెలిపి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అన్యాయమని, కేంద్ర ప్రభుత్వం తీరుపై అంతా కలిసికట్టుగా ఎదిరించాలన్నారు రాజకీయాలకు అతీతంగా పోరాటం సాగించాల్సిన తరుణంలో ఏ పార్టీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు
మందసలో...
కంచిలి నుంచి బయలు దేరి మందస చేరుకున్నారు. సిపిఎం మండల పార్టీ నాయకులు దిలీప్, మట్ట ధర్మారావు, కె కేశవరావు, మార్పు ట్రస్టు అధ్యక్షులు మట్ట ఖగేశ్వరరావు, స్పందన సంస్థ అధ్యక్షులు వడ్డి గోపాల్ తదితరులు స్వాగతం పలికారు. మందసలో వీరగున్నమ్మ స్థూపానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అక్కడ నుంచి సోంపేటకు చేరుకున్నారు
మెళియాపుట్టిలో...
మెళియాపుట్టి చేరుకున్న బైక్ రక్షణ యాత్రకు పార్టీ నాయకులు, ప్రజా, కార్మిక,రైతు సంఘాల నాయకులు సూరయ్య, పోలాకి ప్రసాదరావు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాతపట్నం, హిరమండలం మీదుగా కొత్తూరు చేరుకున్నారు
కొత్తూరులో...
కొత్తూరు చేరుకున్న బైక్ యాత్రకు సిపిఎం మండలం నాయకులు, ప్రజా, కార్మిక, రైతు సంఘాల నాయకులు స్వాగతం పలికారు. డప్పు కళాకారులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి పూల జల్లులు కురిపించారు. కొత్తూరు నాలుగురోడ్లు కూడలి చేరుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సిర్ల ప్రసాదరావు, గంగరాపు సింహాచలం, ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం అప్పారావు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు బైక్ నిమ్మక అప్పన్న, సిహెచ్.ప్రసాదరావు పాల్గొన్నారు.
పాతపట్నంలో...
పాతపట్నం చేరుకున్న బైక్ యాత్రలో సిపిఎం నాయకులు కె.సూరయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు పి.సింహాచలం పాల్గొన్నారు.