ప్రజాశక్తి-ఉరవకొండ గిరిజన గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వజ్రకరూరు మండల పరిధిలోని రాగులపాడులో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకులంలో మౌలిక వసతులతోపాటు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి మెరుగైన బోధన అందిస్తున్నారా.. లేదా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ సక్రమంగా చదువుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతోపాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కేటాయించిన విధంగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం స్టాక్ రిజిస్టర్‌తో రికార్డులను తనిఖీ చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి










