
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యాన నగరంలోని టౌన్‌హాల్ వేదికగా అండర్-19 జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలను ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బలభద్రుని సురేష్ కుమార్ (రాజా) గురువారం ప్రారంభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో నంద్యాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్-19 ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నిరంతర సాధన ద్వారా పోటీల్లో విజయం సాధించవచ్చని చెప్పారు. ఫెన్సింగ్ క్రీడలో మెళకువలు నేర్చుకుని ప్రత్యర్థులపై పైచేయి సాధించాలన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఫెన్సింగ్ ఎన్‌ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ, పిఇటి రాహుల్ వ్యవహరించారు. ఎస్‌జిఎఫ్ కార్యదర్శి ఎన్.రామన్న, రాష్ట్రస్థాయి అండర్-19 పోటీల అబ్జర్వర్ డి.భవాని పాల్గొన్నారు.