Sep 17,2023 23:26

రాజపురంలో ఎండిపోయిన నారుమడి

* ఇచ్ఛాపురం నియోజకవర్గంలో లోటు వర్షపాతం
* ఎండిపోతున్న పంట పొలాలు వరుణుడి కరుణ కోసం
రైతుల ఎదురుచూపులు
ఇచ్ఛాపురం : నియోజకవర్గంలో వరుణుడు ఊరించి ఉసూరనిపిస్తున్నాడు. మబ్బులతో దోబూచులాడి... చినుకులతో సరిపెడుతున్నాడు. కారుమబ్బులు కమ్ముకున్నచోట కూడా కాసిన్ని చినుకులకే పరిమితమవుతున్నాడు. దీంతో పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయి. నియోజకవర్గంలో లోటు వర్షపాతం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వెరసి కర్షకుని పరిస్థితి కడు దయనీయంగా మారుతోంది.
ప్రజాశక్తి - కవిటి: 
ఇచ్ఛాపురం నియోజవర్గంలో ఏ ఇద్దరు రైతులు ఎదురైనా వర్షం కోసమే మాటలు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం సగం పూర్తయినా ఇప్పటికీ నియోజకవర్గంలో లోటు వర్షపాతం నమోదైంది. ఉదాహరణకు కవిటి మండలాన్ని తీసుకుంటే జూన్‌లో -78.1 శాతం లోతు వర్షపాతం నమోదైతే, జూలైలో -11.5, ఆగస్టులో -81.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక నియోజకవర్గంలోని మిగతా మూడు మండలాల పరిస్థితి అదే విధంగా ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అటు కరువు మండలాలకూ చెందక, ఇటు పుష్కలంగా పంటలూ పండక నాలుగు మండలాల రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. వాస్తవానికి ఓవైపు నారుమళ్లు ఎండిపోతుంటే, మరోవైపు వరిచేలు వరుణుడి కోసం ఎదురుచూస్తున్నాయి. కనీసం ఇప్పడు వరుణుడు కరుణించినా చాలా నారుమళ్లు ఉడుపులకు పనికిరావు. సరైన వర్షాల్లేక ఉన్న పంట కూడా పూర్తిస్థాయిలో పండి దిగుబడి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి అంశా లను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
కష్టాలతో ఖరీఫ్‌ సాగు
నేను ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ఆగస్టు ప్రారంభంలో వచ్చిన వర్షానికి దమ్ము చేసి నాట్లు వేశాను. ఇప్పటివరకు సుమారు రూ.53 వేలు ఖర్చు చేశాను. ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది. చినుకు జాడ లేక పైరు పాలిపోతోంది. కారుమబ్బులు కమ్ముకున్న రోజు కూడా కాసిన్ని చినుకులే రాలుతున్నాయి. దీంతో కష్టాల నడుమ ఖరీఫ్‌ సాగు చేస్తున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. - పుల్లట ప్రసాదరావు,
రైతు, భైరిపురం, కవిటి