ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : ఉపాధి పనిలో గాయపడితే ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా ఉపాధి కూలీలకు దారితీన్ను లేకుండా ఉన్నామని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధి పర్యటనల భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు తాడేపల్లిగూడెం మండలంలో చిన తాడిపల్లి, కడియద్ద, గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు ఆరు గంటలకి మస్టర్ కి అదర బదరగా పనికి వచ్చేస్తున్నామని పిల్లలకు టిఫిన్ కూడా పెట్టుకోకుండా వస్తున్నామని, మండుటెండలో పనిచేస్తున్న మమ్మల్ని ఎవరు పట్టించుకోవడంలేదన్నారు. గతంలో పని ప్రదేశంలో గాయపడితే మెడికల్ కిట్లు ఉండేవని, ఇప్పుడు దెబ్బ తగిలితే ప్రైవేటు డాక్టర్ని ఆశ్రయించి వైద్యం చేయించుకోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో మెడికల్ కిట్లు,మంచినీళ్లు, మజ్జిగ లేక అనేక ఇబ్బంది పడుతున్నామని అవన్నీ గతంలో ఇచ్చేవారని అవి లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం చేసిందని కూలీలు మండిపడ్డారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ, ఉపాధి కూలీలు పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు,వాళ్ళ అనుసరిస్తున్న విధానం మారకపోతే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు కర్ణాటకలో బిజెపిని ఎలా సాగనంపారో అలాగే పేదలు, వ్యవసాయ కూలీలు బిజెపిని సాగనంపుతారని అందుకు కూలీలంతా చైతన్య అవుతున్నారని అన్నారు. రద్దు చేసిన సౌకర్యాలని పునర్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పేదలు వ్యవసాయ కూలీలు జగన్ మోహన్ రెడ్డిని గెద్దనెక్కిస్తే, జగన్ ప్రభుత్వం పేదలు, వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసి మోడీకి గొడుగు పడుతున్నాడని, ఆయన పట్టాల్సింది మోడీకి కాదని పేదలు వ్యవసాయ కూలీలకు పట్టాలని ఆయన కోరారు. ఏవైతే రద్దు చేసిన మౌలిక సదుపాయాలన్నీ మరల పునరుద్ధరించాలని, లేనియెడల ఉపాధి కూలీలు ఐక్యతతో పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డొక్కా వెంకటేశులు, సీలి రాణి, దూలపల్లి నాగమణి, దూలపల్లి వెంకటరత్నం, సిహెచ్.రాజేష్, యాతం నాగేశ్వరరావు, గంగిరెడ్డి బాపిరాజు, గట్టు నరసారావు, అడపాల బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.










