- నిలిచిన నాల్గు వారాల చెల్లింపులు
ప్రజాశక్తి-రోళ్ల: ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఏరోజుకారోజు కూలి చేసుకునే వాళ్లకు ఎక్కడైనా సాయంత్రానికి వేతనం చెల్లిస్తారు. దాంతో వారు రోజువారి జీవనం సాగిస్తారు. పేద కూలీల డబ్బులకు ఏ రోజుకుఆరోజు వేతనాలు చెల్లింపు చేస్తే అదే రోజు సాయంత్రం ఇంటికి కావలసిన ముడీ సరుకులను తీసుకుంటారు. ఎప్పటినుంచో రోజువారి కూలీల బతుకులు అలాగే సాగుతున్నాయి. అయితే గ్రామాలలో ఏపనులు లేనివారికి వ్యవసాయ పనులు లేనప్పుడు పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 100 రోజులు పనులు కల్పిస్తున్నది. ఈ ఉపాధి వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాల వల్లనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని తెచ్చింది. అయితే ఈ పథకాన్ని కేంద్రం రాను రాను నీరుగార్చే యత్నం చేస్తుంది. వేసవిలో ఈ పథకం కిందనే కుటుంబానికి వంద రోజులు పనులు కలిపిస్తున్నది. వేసవిలో కూడా పేద కుటుంబాలు ఈ పనుల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కూలీ తోనే జీవనం సాగిస్తున్నారు. ఈ కూలీలకు కూడా కేంద్ర ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. రోళ్ల మండలానికి సంబంధించి ఏపీవో ఓబులేశును వివరణ కోరగా రోళ్ల మండల వ్యాప్తంగా కూలీలకు సంబంధించి 10 లక్షలు బిల్ పెండింగ్లో ఉన్నట్టు ఏపీవో తెలిపారు. వాస్తవానికి రెండు వారాలకు ఒకసారి వేతనం చెల్లించాలి. నాలుగు వారాలు దాటిన వారికి వేతనాలు చెల్లించలేదు. మరి వారి కుటుంబం ఎలా గడవాలి? ఎలా బతకాలి? అప్పులు చేయాలా? ప్రభుత్వం ఆలోచించడం లేదు. దీంతో వేతనాలు రాక కూలీలు పడుతున్న అవస్థలు వర్ణాతితం. ఇంకా పనులు చేసే ప్రాంతంలోనూ ఇప్పటికీ ఉన్న సౌకర్యాలు కూడా నామమాత్రాన అందిస్తున్నారు. మంచినీళ్లు. మజ్జిగ. టెంట్లు లాంటివి గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవి ఎక్కడ కనిపించడం లేదు. ఇంటి నుంచి బాటిల్ నీరు తీసుకుని వెళుతున్నారు. అవి ఎండకు వేడెక్కుతున్నాయి. వాటిని తాగుతున్నారు. ఇలా నీటికి కూడా ఇక్కట్లు పడుతున్నారు. మండుటెండల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్న సరైన టెంటు లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. చెట్లు ఉంటే సరి లేకుంటే ఎండలోనే ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి రావలసిన వేతనాలు చెల్లించి కూలీలకు సరిపడే సౌకర్యాలను కల్పించి కూలీలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు.










