యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి
ఫ్యాప్టో ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి - పాలకోడేరు
పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ దుందుడుకు చర్యలను ఫ్యాప్టో తీవ్రంగా ఖండించింది. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక ఎంఆర్‌సిలో సోషల్ ఆడిట్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలు సకాలంలో ఇవ్వలేదని, ఇచ్చిన పుస్తకాలూ విడతలవారీ ఇచ్చారని గుర్తు చేశారు. కొన్ని పుస్తకాలైతే విద్యా విద్యాసంవత్సరం ముగుస్తున్నా రాలేదని గుర్తు చేశారు. విద్యార్థులకు ఇచ్చిన బూట్లు కొలతలకు సరిపడా లేకపోవడం, నాణ్యత లేని బ్యాగ్‌లిచ్చారని, ఈ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయులు, అధికారులపై విధించిన అక్రమ సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్.విజయరామరాజు, జిల్లా కార్యదర్శి కెఎస్‌ఆర్‌కె.ప్రసాద్, ఎస్‌టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.మహంకాళి, బి.పాండురంగారావు, శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాలకొల్లు: ఉపాధ్యాయులపై విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ చర్యలను ఖండిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యాన స్థానిక ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మంగళవారం నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు కె.రాజశేఖర్ మాట్లాడారు. ఒక అధికారి మార్గదర్శకునిగా ఉండాలే తప్ప ఒక నియంతగా వ్యవహారించకూడదన్నారు.
కాళ్ల: పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సిహెచ్.పట్టాభిరామయ్య అన్నారు.
ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. లక్ష్మీనరసింహపురం ప్రాథమికోన్నత పాఠశాలలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సిహెచ్.పట్టాభిరామయ్య మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్.సీతాదేవి, కె.కృష్ణమూర్తి, ఎన్‌ఎ.నరసింహరాజు, పివిఎల్.గ్లోరీ, గీతావరలక్ష్మి, ఎస్.రామాంజనేయులు, బి.వెంకటరత్నం, కె.భవానీప్రసాద్ పాల్గొన్నారు.
యలమంచిలి: పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చర్యలను ఖండిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యాన మంగళవారం మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి.క్రాంతికుమార్ మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలు సకాలంలో ఇవ్వలేదని, కొన్ని పుస్తకాలు ఇప్పటికీ ఇవ్వలేదని, దీనికి ప్రవీణ్‌ప్రకాష్, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నేతలు ప్రసాద్, సరళ్ల లక్ష్మి, కుడిపూడి సత్యనారాయణ, జి.శ్రీనివాసరావు, మల్లుల శ్రీధర్, చింత సత్యనారాయణ, గొర్రెల మాధవి పాల్గొన్నారు.










