అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఫ్యాప్టో నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ ఎస్.సిరాజుద్దీన్, సెక్రెటరీ జనరల్ జి.లింగమూర్తి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమణారెడ్డి, గోవిందరాజులు, నాయకులు సూర్యుడు, కొటేశ్వరప్ప, లింగమయ్య హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. పాఠశాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న 117 జీవోను రద్దు చేయాలన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలన్నారు. ఉద్యోగోన్నతులను రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలని కోరారు. సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్ విధానం అమలు చేయాలన్నారు. పిఆర్‌సి ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. చట్టబద్ధమైన 12వ పిఆర్‌సిని వెంటనే నియమించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 11వ పిఆర్‌సికి అనుగుణంగా పెంచాలన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఉద్యమ కార్యాచరణను తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఒ గాయత్రిదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు సతీష్, సురేష్, రాజశేఖర్, వెంకటరమణ, సర్దార్ వలి, శంకరమూర్తి, శివ శంకర్, నారాయణస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










