Jul 11,2022 22:54

ఉపాధ్యాయ సమస్యలపై యుటిఎఫ్‌ వినతి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఐఖ్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారి, జెడ్పి సిఇఒ, ట్రైజరీ జిల్లా అధికారి, సమగ్రశిక్షా అభియాన్‌ అధికారులకు విన్నతులు చేశారు. ఈసందర్భంగా యుటిఎఫ్‌ జిల్లాకార్యదర్శి జివి.రమణ మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి నెలవారి చందాల వివరాలు ఆన్లైన్లో పొందుపరచి వడ్డీను నమోదు చేసి పూర్తి చేయాలన్నారు. ఉద్యోగుల రుణాలు, తుది చెల్లింపులు నిమిత్తం దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పటి వరకు, ఎవరికి చెల్లించారో స్పష్టత లేదని, ఆ వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇటీవల మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ సత్వరమే నియామకాలు చేపట్టాలని కోరారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినా ప్రభుత్వ బడులలో పిల్లలు చేరుతున్నారని, పిల్లల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తిస్థాయిలో చేయాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 117 జీవో ప్రకారం ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసే సందర్భంలో జాతీయ రహదారులు, వాగులు, అడవులు ఉన్నప్పటికీ కూడా కూడా విలీనం చేయడం వల్ల 3,4,5 తరగతుల పిల్లలు సమీపంలోని పాఠశాలలకు చేరుకోలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతిరెడ్డి జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు పి.సుధాకర్‌రెడ్డి, జివి రమణ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.సోమశేఖర్‌ నాయుడు, జిల్లా కార్యదర్శులు కె.రెడ్డప్ప నాయుడు, టి.దక్షిణామూర్తి, బిర్లా నాయుడు, రాజేష్‌ కుమార్‌, సారథి తదితరులు పాల్గొన్నారు.