
* వ్య.కా.స జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన నగరంలోని అంబేద్కర్ కూడలిలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్షాల కృషితో యుపిఎ హయాంలో ఉపాధి హామీ చట్టం ప్రారంభమైందని గుర్తుచేశారు. ఈ చట్టం గ్రామీణ ప్రాంత కూలీలు, వ్యవసాయ కార్మికులకు ఆసరాగా ఉంటోందన్నారు.ఉపాధి హామీతోనే జిల్లాలో వలసలు కొంత తగ్గుముఖం పట్టాయన్నారు. పేదరికం, వలసల నివారణ, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తులు సమకూర్చడం వంటి ఉన్నత లక్ష్యాలు అమల్లోకి వచ్చాయన్నారు. వంద రోజుల పని దినాలు రూ.వంద కూలితో ప్రారంభమైన ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కార్మిక సంఘ పోరాటాల ఫలితంగా రూ.257కి పెరిగినట్లు తెలిపారు. ఈ చట్టం అమలు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్నారు. ఇటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కోత పెడుతోందని విమర్శించారు. ఉపాధి హామీని ప్రజలే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, ఎల్.వెంకటరావు, పొందూరు భవానీ, రాకోటి చిఆ్నరావు, తిర్లంగి రామారావు, కె.అప్పారావు, పి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.