Feb 18,2022 22:19

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ రాజాబాబు

ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌ :
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధ్యక్షులు పి.రామ చంద్రారెడ్డి ఆద్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలాని ఆ మేరకు రేజల్యూషన్‌ పాస్‌ చేసి మన జిల్లా నుండి ప్రతి పాధనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. 3 లేదా 4 నెలలకు ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ కమిషనర్ల ఆద్వర్యంలో జిల్లాలో సమావేశం ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వేసవిలో ట్రాన్స్‌ ఫార్మార్లు కాలిపోతు న్నాయని వాటిని పునరుద్దించేందుకు విద్యుత్‌ శాఖాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరగా, జిల్లా కలెక్టర్‌ యం.హరినారాయణన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరై మాట్లాడుతూ ట్రాన్స్‌కో అధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని విధ్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మార్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సమన్వయ సమావేశంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులను పిలిచి రైతులు ఎదుర్కొంటున్న ట్రాన్స్‌ ఫార్మార్ల సమస్యల పై చర్చించి పరిష్కరిస్తామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతు భరోసా) పి.రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో వ్యవ సాయ మండలి సమావేశాలు ప్రతి నెల ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో జరుపుకుంటున్నామని, రైతులందరూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి కూర్చొని తమ సమస్యలను చర్చించుకుంటే వారికి పరిష్కారం దొరకడంతో పాటు రైతు భరోసా కేంద్రాలకు సార్ధకత కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు రైతులకు సక్రమంగా అందజేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాన్స్‌ ఫార్మర్లను ప్రాధాన్యత ప్రకారం పునరుద్దరించాలని రైతులకు పంట నష్టం జరగకముందే కాలిపోయిన ట్రాన్స్‌ ఫార్మార్లు స్థానంలో వేరే ట్రాన్స్‌ ఫార్మార్లు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో పులిచెర్ల మండలం ముత్తుకువారిపల్లి రైతు భరోసా కేంద్రంలో నాణ్యత గల ఇన్‌ పుట్స్‌, ప్రొక్యూర్‌ మెంట్‌, ఉత్తమ సంక్షేమ సేవలు రైతులకు అందించినందులకు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ఐ.ఎస్‌.ఓ సర్టిఫికేట్‌ అందజేశారని ప్రశంసిస్తూ సర్టిఫికేట్‌ ను రైతు భరోసా కేంద్రం సిబ్బందికి బహుకరించారు. ఈ సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ అగ్రికల్చర్‌ దొరసాని, హార్టికల్చర్‌, సిరికల్చర్‌, తదితర శాఖాదికారులు హాజరయ్యారు.