ప్రజాశక్తి-ఆత్మకూరు మండల పరిధిలోని పంపనూరు గ్రామంలో మంగళవారం చేపట్టిన ఉపాధి హామీ పనులను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పని దినాలు పెంచామని, సక్రమంగా పని చేసుకోవాలని సూచించారు. అలాగే కూలీలకు బిల్లలు త్వరగా పడేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేగాకుండా కూలీలు శాతం పెంచాలని ఎపిఒను ఆదేశించారు. ఇందుకు ఎపిఒ స్పందిస్తూ రైతుల పనులు ఎక్కువగా ఉండటంతో కూలీలు ఎక్కువగా ఆ పనులకు వెళ్తున్నారన్నారు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత కూలీల శాతం పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నత ఉద్యోగానికి శిక్షణ తీసుకునేందుకు లాంగ్ లీవ్‌లో వెళ్లారని సర్పంచి ఎర్రిస్వామి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఒఆర్‌డి సత్తిబాబు, ఎపిఒ సుజాత, పంపనూరు సర్పంచి యడుమల ఎర్రిస్వామి, తదితరులు పాల్గొన్నారు.
కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి










