May 20,2023 09:09

బుక్కరాయసముద్రంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

       అనంతపురం ప్రతినిధి : 2004లో ఏర్పడిన యుపిఎ-1 ప్రభుత్వం వామపక్షల ఒత్తిడి మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది. ఈ పథకానికి ఇప్పటి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ వస్తోంది. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపులు బాగ తగ్గించిన నేపథ్యంలో ఉపాధి పనికెళ్లే వ్యవసాయ కూలీలకు తిప్పలు తప్పడం లేదు. అన్నింటిలోనూ కోతలు పెడుతూవస్తోంది. జిల్లాలో అమలు జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనితీరును పరిశీలించేందుకు 'ప్రజాశక్తి'శుక్రవారం నాడు బుక్కరాయసముద్రం మండలంలోని బుక్కరాయసముద్రం, సిద్ధరాంపురం గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఈ రెండు గ్రామాల పరిధిలో పనిచేసే కూలీలు తమ సమస్యలను తెలియజేశారు.
          బుక్కరాయసముద్రం సిద్ధరాంపురం గ్రామం పరిధిలో 585 జాబ్‌ కార్డులున్నాయి. 614 మంది వ్యవసాయ కూలీలు నమోదై ఉన్నారు. ప్రతి రోజూ సగటున 300 మంది వరకు ఈ గ్రామం నుంచి ఉపాధి పని కోసం వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనిలో పారదర్శక తీసుకొచ్చే పేరుతో సాప్టువేర్‌లో మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉదయం, సాయంత్రం రెండు పూటలా పనిచేసే కూలీల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. దీన్ని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చేస్తుంటాడు. అయితే ఎన్‌ఐసిలో సాంకేతిక సమస్యల కారణంగా పొటో అప్‌లోడ్‌లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కోరోజు ఫొటో అప్‌లోడ్‌ చేసినా సైట్‌లో చూపించడం లేదు. దీంతో ఆ రోజు కూలీలు పనిచేసినా ప్రయోజనముండటం లేదు. దీంతో కూలీలకు పనిదినాలు లేకుండాపోతున్నాయి
అన్నీ కోతలే..!
         ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఇస్తున్న అలవెన్సులు అన్నింటిలోనూ కోతలు పెట్టింది. ప్రధానంగా వేసవి కాలంలో గత ఏడాది వరకు ఆ రోజు పడిన కూలిపై 30 శాతం అదనంగా అలవెన్సు కింద ఇచ్చేవారు. కాని ఈ ఏడాది అది లేకుండా చేసింది. ఇక గునపం పదును చేసుకోవడానికి వారానికి రూ.50 వరకు అలవెన్సుగా ఇచ్చేవారు. దాన్ని కోతపెట్టింది. వేసవి కాలంలో వడదెబ్బకు గురవకుండా ఉండేందుకు మజ్జిగ వంటి వాటికి నిధులు ఇచ్చేది. ఐదు కిలోమీటర్లకంటే ఎక్కువగా ఉంటే రవాణా ఛార్జీలు ఉండేవి. కాని ఈసారి వాటిని ఇవ్వడం లేదు. దీంతో కూలీలకు గతేడాది కంటే వచ్చే వేతనాలు బాగా తగ్గిపోయాయి.
కానరాని కనీస సౌకర్యాలు
             పని చేసే ప్రదేశంలో ఉపాధి కూలీలకు కల్పించే కనీస సౌకర్యాలు మచ్చుకైన కన్పించవు. పనులు జరుగుతున్న ఏ ప్రాంతంలో పరిశీలించినా సౌకర్యాలలేమి కన్పిస్తుంది. పనిచేసే చోట మంచినీళ్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు, టెంట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆచరణలో ఇవి అమలుకావడం లేదు. ఇక పనిముట్లు ఎప్పుడిచ్చారో కూడా తెలియని పరిస్థితినుంది. ఉపాధికి సంబంధించి పనిముట్లు ఇస్తారన్న సంగతి కూడా కూలీలకు తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి ప్రారంభంలో మంచినీళ్లకు రూ.5, ఉపాధి పని ప్రదేశం 5కి||మీ|| దాటితో రానుపోను ఛార్జీలు, గునపం సానకు డబ్బులను ప్రభుత్వం ఇచ్చేది. కొత్త విధానాలు అమల్లోకి వచ్చాక వీటిన్నంటినీ ప్రభుత్వం రద్దు చేసింది.
రూ.40 ఛార్జీకే పోతోంది..
హనుమంతు,
వ్యవసాయ కూలీ, కొండాపురం గ్రామం.

            ఊరి నుంచి పనిచేసే చోటుకు రావాలంటే సుమారు ఆరు కిలోమీటర్లు ఉంది. దీంతో ఆటో మాట్లాడుకుని రావాలి. రావడానికి రూ.20,పోవడానికి రూ.20 కలిపి మొత్తం రోజుకు రూ.40 ఛార్జీల రూపంలో పోతోంది. ఎండాకాలం కాబట్టి నేల గట్టిగా ఉండి రోజంతా కష్టపడితే రూ.200కు మించి రావడం లేదు. దానిలో రూ.40 ఛార్జీలకు పోతే రూ.160 మాత్రమే మిగులుతోంది. అందులో మస్టర్‌ పడకపోతే ఆ రోజు కూలీ రాదు. గతేడాది ఈఏడాది చూస్తే వారానికి సుమారు రూ.300 వరకు కూలి తగ్గింది.
అలవెన్సులు ఇవ్వాలి
కృష్ణమూర్తి,
ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.

          కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. నిధుల కేటాయింపులు తగ్గించింది. క్షేత్రస్థాయిలో చూసినా ఇదే స్పష్టమవుతోంది. పనిదినాలు తగ్గిపోతున్నాయి. అలవెన్సుల్లోనూ కోతలు పెడుతున్నారు. కేవలం పనిచేసిన దానికే కూలి అన్నట్టుగా ప్రభుత్వం నిబంధనలు తీసుకొస్తోంది. ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే వేసవి కాలంలో ఇచ్చే అలవెన్సు ఇవ్వాలి. రవాణా ఛార్జీలూ ఇవ్వాలి. పనిదినాలు పెంచాలి.