Mar 11,2023 20:53

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న ఉపాధి కూలీలకు రోజు కూలి రూ.600 ఇవ్వాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం తణుకు మండలం మండపాక గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతల వద్ద కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పూటలా పని, మస్తరు విధానం వల్ల పని ప్రదేశంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని తెలిపారు. దీనిపై చన వీరభద్రరావు మాట్లాడారు. ఉపాధి హామీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.257 కాకుండా వేతనాలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పని అడిగిన వారికి వంద రోజులు పని కల్పించాలన్నారు. బెంగాల్‌ యూపీ కూలీలు రావడం, వీటికి తోడు వ్యవసాయ భూములన్నీ పరిశ్రమలు, ఇళ్ల స్థలాలకు కేటాయించడం వల్ల పనులు తగ్గిపోయి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. చేసిన పనికి ప్లే స్లిప్పులు ఇవ్వాలన్నారు. డిమాండ్ల సాధనకై వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 5న జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో. వ్యవసాయ కార్మికులు, కార్మికులు, రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నమట్ల రామారావు, వీరవల్లి వరలక్ష్మి, గారపాటి ధనరాజు, పొట్ల దానమ్మ, ఉన్నమట్ల ప్రశాంతి, అరిగెల మునెమ్మ, ఎలిసెట్టి కేశవరావు, ఎర్ర పెద్ద అప్పారావు, కొండపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.