ప్రజాశక్తి-ఉరవకొండ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం వజ్రకరూరు మండల పరిధిలోని కడమలకుంట గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం కూలీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ఒక వరం లాంటిదన్నారు. ఈ చట్టాన్ని నమ్ముకుని సుమారు నాలుగు లక్షల మందికిపైగా జీవనం సాగిస్తున్నారన్నారు. ఇలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కేంద్రం పూనుకోవడం బాధాకరమన్నారు. చట్టంలో కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి సమ్మర్ అలవెన్స్, అదనపు వేతనాలను రద్దు చేసిందన్నారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ఉపాధి కూలీలు పనులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పనులు చేసే ప్రదేశంలో వెంటనే షామియానాలు ఏర్పాటు చేయడంతోపాటు మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. త్వరగా బిల్లులు అందేలా చర్యలు చేపట్టారని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి










