ఉపాధి కూలీల సంఖ్య పెంచండి
జిల్లా సంచాలకులు చంద్రశేఖర్
ప్రజాశక్తి- యాదమరి:
ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని జిల్లా ఉపాధి హామీ చట్టం సంచాలకులు చంద్రశేఖర్ ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని 14 కండ్రిగ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడుతూ ఉపాధి బిల్లులు సకాలంలో అందుతున్నాయా, అడిగిన వెంటనే పనులు సకాలంలో కల్పిస్తున్నారా లేదా..అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన పనులను కల్పించాలన్నారు. అనంతరం ఉపాధి హామీ కార్యాలయం రికార్డులను పరిశీలించారు. రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంచనాలు తయారు చేయాలన్నారు. 60 శాతం ఉపాధి కూలీలు, రైతులకు పనులు అంచనాలు తయారు చేయాలన్నారు. 40 శాతం గ్రామపంచాయతీ పరిధిలో కమ్యూనిటీ పనులు అంచనాలు తయారు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి రైతులకు, ఉపాధి కూలీలకు అవసరమయ్యే పనులను గుర్తించాలని వాటికి అంచనాల తయారు చేయాలన్నారు. మండల పరిధిలో పనులు గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. మండల పరిధిలో కూలీల సంఖ్య చాలాతక్కువగా ఉందని గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలసంఖ్య పెంచకపోతే సిబ్బందిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉపాధి హామీ కార్యాలయంలో రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. అనంతరం యాదమరి గ్రామ సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డును పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చిత్తూరు క్లస్టర్ ఏపీడీ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో శివరాజ్, పంచాయతీ కార్యదర్శి గజేంద్ర, ఏపీఓ కవిత, ఈసీ రమ్య, టెక్నికల్ అసిస్టెంట్ మనోహర్, మధు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










