ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
నందమూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం తలెత్తిన మస్తర్ లోపాలను సరిచేసి కూలీలందరికీ పనులు కల్పించడం హర్షణీయమన్నారు. అందరికీ పనులు కల్పించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.సోమరాజు అన్నారు. నందమూరులో పనులు ఆలస్యంగా మొదలుపెట్టినందుకు గాను కూలీలకు ఎక్కువ రోజులు పనులు కల్పించాలన్నారు. రూ.600 వేతనం, 200 రోజులు పని దినాలు అమలు చేయాలని, రెండు పూటలా మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టి.శ్రీనివాస్, కొప్పిశెట్టి హరికృష్ణ, ఎ.సత్యనారాయణ, రెడ్డి నాగరాజు, వీరెల్లి పోతురాజు, ఎ.అప్పారావు, పర్వతం గణపతి, వి.పోచమ్మ పాల్గొన్నారు.
అత్తిలి:ఉపాధి హామీలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ డిమాండ్ చేశారు. ఈడూరులో పని ప్రదేశంలో ఉపాధి కూలీలను కలుసుకుని వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేతా గోపాలన్ మాట్లాడుతూ కార్మికుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారని, ఒకటి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారని తెలిపారు. ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉందని, పని ప్రదేశాల్లో తాగునీరు లేక కూలీలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. రెండు పూటలా మస్తరు విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరుణ, బొట్టా అప్పన్న, సిపిఎం గ్రామం నాయకులు పాల్గొన్నారు.
ఉండి : మండుటెండ, వడగాల్పులను తట్టుకొని వ్యవసాయ కార్మికులు పనిచేస్తుంటే మజ్జిగ, తాగునీరు, టెంట్లు వంటి సదుపాయాలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల ఉసురు తీస్తున్నాయని సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం యండగండి గ్రామంలో ఉపాధి పనుల ప్రదేశానికి వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో మజ్జిగ, తాగునీరు, టెంట్లు వంటి సదుపాయాలను కుదించిన ప్రభుత్వం మస్తర్ విధానాన్ని, పేస్లిప్పుల విధానాన్ని తొలగించిందని తెలిపారు. ఉపాధి కార్మికులు తాము ఎన్ని రోజులు పని చేశామని చెప్పుకోవడానికి ఆధారం లేకుండా చేశారన్నారు. ఇంటి దగ్గర ఉదయాన్నే వచ్చే పంచాయతీ కుళాయి నీళ్లు పట్టుకోవడానికి అవకాశం లేకుండా పోతోందన్నారు. జిల్లా అధికారులు చట్టంలో ఉన్న విషయాలను పట్టించుకుని ఉపాధి కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆచంట : ఉపాధి హామీలో పని ప్రాంతంలో ఆన్‌లైన్ ఫొటో, మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని, మజ్జిగ, నీరు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని ఎ.వేమవరం శివారు పడమరపాలెంలో ఉపాధి కూలీల పని ప్రాంతంలో కూలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పెరిగిన ఉష్ణోగ్రతకు తగినట్టుగా పని ప్రాంతంలో టెంట్లు, సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. కనీస వేతనం రూ.600 ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండేటి సత్యనారాయణ, సిర్రా విఘ్నేశ్వరరావు, కడలి రాజేశ్వరి, కడలి భాగ్యలక్ష్మి, కడలి పెద్దింట్లు పాల్గొన్నారు.
పెనుమంట్ర : ఉపాధి హామీని నిర్వీర్యం చేసే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.సుబ్బరాజు అన్నారు. నత్తారామేశ్వరంలో ఉపాధి హామీ పనులను ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గతంలో కంటే 33 శాతం బడ్జెట్లో కోత విధించిందన్నారు. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. ప్రస్తుతం జాబ్ కార్డులు కూడా ఉనికిలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు .రెండు పూటలా పని విధానాన్ని రద్దు చేయాలని, ఫొటో ద్వారా మస్తర్ విధానాన్ని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ, కంతేటి సత్యనారాయణ, చవాకుల భీముడు, చీలి అన్నమ్మ, దాసరి లక్ష్మి, చవ్వాకుల సునంద పాల్గొన్నారు.










