ప్రజాశక్తి - పెనుగొండ
కోట్ల మంది గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టం నేడు ప్రమాదంలో పడిందని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ పాదుషా అన్నారు. గురువారం పెనుగొండ అడ్డపుంత, కొటాలపర్రులో పని ప్రాంతంలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఉపాధి హామీలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను తెచ్చిందన్నారు. రెండు పూటలా పని విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల ఉపాధి కూలీలకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఈ పథకాన్ని ఎత్తివేయడం కోసం బిజెపి చేసిన అనేక కుట్రల్లో భాగంగా కూలీలకు వేతనాలు, సమ్మర్ అలవెన్స్, మేట్ల పారితోషకం, ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతోందన్నారు. కూలీలకు పోస్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న భీమవరం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.










