Apr 28,2023 22:01

'ఉపాధి' కల్పించరూ..

         ప్రజాశక్తి-బొమ్మనహాళ్‌   మండల పరిధిలోని మల్లనగుడ్డం, ఉంతకల్లు, లింగదహాల్‌, కష్ణాపురం, గోనెహాళ్‌, సిద్ధరాంపురం, కురవల్లి, నేముకల్‌ గ్రామాల్లో ఉపాధి, వ్యవసాయ పనులు లేక ప్రజలు వలస పోవడానికి సిద్ధమవుతున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో 300 నుంచి 400మంది కూలీలు ఉన్నారు. అయితే అధికారులు మార్చి అకౌంట్‌ సెక్షన్‌(ఆర్థిక సంవత్సరం ముగింపు) దష్టిలో ఉంచుకొని పనుల ఎస్టిమేషన్లు, వర్క్‌ ఆర్డర్లు ఇవ్వలేదు. అధికారుల ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఏప్రిల్‌, మే నెలల్లో ఉపాధి హామీ పనులు మంజూరు కాలేదని, దీనికి తోడు వ్యవసాయ పనులు లేక ప్రజలు వలస పోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు కొందరికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు. ఇకనైనా ఉపాధి హామీ పథకం జిల్లా అధికారులు స్పందించి పని దినాలు కల్పించాలని కోరుతున్నారు.
ఊసే లేని గ్రామ సభలు
ఉపాధి హామీ ఏపీవో, టెక్నికల్‌ అసిస్టెంట్లు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని, గ్రామాల్లో పనులను ఎంపిక చేయడానికి గ్రామ సభలు నిర్వహించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ పనులకు అనుసంధానమైన చిన్న కాలువలు, వాగులు, గ్రావెల్‌ తొలగించడం, పొలాలకు పూడిక తరలించడం, తదితర కార్యక్రమాలు చేపడితే పలువురు రైతుల భూములు సాగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఆయా అంశాలపై చిన్న సన్న కారు రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించినా వాటిపై స్పందించే వారే కరువయ్యారని వాపోతున్నారు. వంకలు, వాగులకు అడ్డుకట్టలు వేయడం, నీరు నిల్వ ఉండడానికి ఫార్మ్‌ పాండ్‌లు ఏర్పాటు చేయడం, తదితర పనులు కల్పించడం లేదని కూలీలు పేర్కొంటునారు.
ఎంపీడీఓ వివరణ: ఆయా విషయాలపై ఎంపీడీఓ షకీలా బేగంను వివరణ కోరగా త్వరలో అందరికీ పని కల్పిస్తామని తెలిపారు.