May 23,2023 21:51

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌

          ప్రజాశక్తి-శింగనమల   ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం మండల పరిధిలోని ఉపాధి హామీ కూలీలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చిన నూతన విధానాల వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా రెండు పూటలా పని రద్దు చేయాలని, సమ్మర్‌ అలవెన్స్‌ 40శాతం, వంద రోజులు పూర్తి చేసిన కుటుంబానికి అదనంగా వంద రోజులు పనులు కల్పించాలని, పనుల దగ్గర కనీస సౌకర్యాలు కల్పించాలని, ఆన్‌లైన్‌ మస్టర్‌ను రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని, ప్లే షిప్‌లు ఇవ్వాలని, క్షేత్రస్థాయి మేట్లకు స్మార్ట్‌ఫోన్ల ఖర్చు నిమిత్తం రూ.5పారితోషకం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే గునపం గడ్డపార, గంప, గునపం తట్టేదానికి రూ.60, పనిముట్లు, మెడికల్‌ కిట్లు, నీరు, నీడ కోసం టార్పాలిన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టనున్న ధర్నాలో పెద్దఎత్తునా కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సుంకన్న, ఎర్రిస్వామి, ఈశ్వరయ్య, ముత్యాలు, గంపమల్లయ్య, ఆంజనేయులు, కుళ్లాయప్ప, రామాంజనేయులు, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు
బుక్కరాయసముద్రం : ఉపాధి చట్టాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఈనెల 25న కలెక్టరేట్‌ ఎదుట ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం మండలంలోని ఉపాధి కూలీలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో లేనిపోని నిబంధనలు తీసుకొచ్చి కూలీల కడుపు కొడుతోందన్నారు. వెంటనే చట్టంలో నూతన విధానాలను ఉపసంహరించుకుని కూలీలకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్య.కా.సం అధ్యక్షులు పుల్లయ్య, మండల కార్యదర్శి ఎ.నాగలింగమయ్య, కార్యకర్తలు వెంకట్రాముడు, నారాయణస్వామి, చిన్న నారాయణస్వామి, లక్ష్మీ, నీరజ, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.