May 05,2023 21:11

ప్రజాశక్తి - అత్తిలి
వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం అత్తిలిలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి కొద్దిసేపు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరభద్రరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస పోకుండా ఉన్న ఊరిలోనే ఉపాధి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన ఉపాధి హామీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరింత పటిష్టంగా అమలు చేయాల్సిందిపోయి, భూస్వాములు, పెట్టుబడిదారులకు ఉపాధి హామీ నిధులు దోచి పెడుతూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర పన్నుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి కూలీలకు ఎక్కువ రోజులు పని కల్పించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రూ.600 ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బొంతు లక్ష్మి, కవురు చంద్రకళ, శనగన వెంకటేశ్వరరావు, బొంతు శ్రీను, మట్టపర్తి లక్ష్మి, పిల్లి ఆశీర్వాదం, బొంతు సీతారత్నం పాల్గొన్నారు.