Oct 11,2023 18:32

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించి, పని దినాలు, వేతనాలు పెంచాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్త పిలుపులో భాగంగా వ్యకాస ఆధ్వర్యంలో స్థానిక గ్రామ సచివాలయ కార్యదర్శి ఎస్‌వివి.నరసింహమూర్తికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ దశాబ్ధాల తరబడి ఎర్రజెండా నాయకత్వంలో వామపక్షాలు చేసిన పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ చట్టం వచ్చిందన్నారు. ఈ చట్టం వచ్చాక గ్రామీణ ప్రాంత పేదలకు పని గ్యారంటీ భరోసా కల్పిస్తూ కూలీల జీవన ప్రమాణాల మెరుగుదలకు కొంతమేర దోహదపడిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నేడు బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని విమర్శించారు. తక్షణం కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, పెండింగ్‌ బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దొంగల నాగేశ్వరరావు, సభ్యులు బండారు వెంకటేశ్వరరావు, నీలం వెంకట బసవయ్య, ఆలం ధనరాజు పాల్గొన్నారు.
యలమంచిలి :ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏనుగువానిలంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మాసవరపు సుబ్బారావు, యడ్ల మోహనరావు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం ద్వారా బ్యాంకు అకౌంట్లకు, ఫోన్‌ నంబర్లకు ఆధార్‌ లింక్‌ చేయడంతో కూలీలు పనిచేసినా వారి వేతనాలు వారు అందుకునే పరిస్థితి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ మండల నాయకులు కానేటి బాలరాజు, ఉపాధి కూలీలు కొండపల్లి రామకృష్ణ, యు.శ్యామల పాల్గొన్నారు.