ప్రజాశక్తి - వీరవాసరం
ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేలా ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా రెండు పూటలా మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జుత్తుగ నరసింహమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పెర్కిపాలెంలో ఉపాధి కూలీల పని ప్రాంతంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సత్యనారాయణ, నరసింహమూర్తి మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీకి బడ్జెట్లో నిధుల కోత పెట్టారన్నారు. కరోనా కష్ట కాలంలో కూలీల ఆకలి చావుల్లేకుండా ఉపాధి హామీ పనులు కాపాడాయన్నారు. అంత ప్రాధాన్యత కలిగిన చట్టానికి నిధులు తగ్గించడం సిగ్గుచేటు అన్నారు. మండల అధ్యక్ష కార్యదర్శులు పోతుల మృత్యుంజయ, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, జిల్లా మహిళా కన్వీనర్ జె.వెంకటలక్ష్మి మాట్లాడారు. కనీస వేతనం రూ.600 ఇచ్చి, పని దినాలు 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.త్రిమూర్తులు, పోతుమేని సత్యవతి, మహేశ్వరి, పీతల కొండాలమ్మ, పీతల దుర్గ, పి.నరసమ్మ, పి.రాంబాబు, పేరం దుర్గ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం:ఉపాధి హామీలో రద్దు చేసినవన్నీ పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటన భాగంగా శుక్రవారం అప్పారావుపేట, గొల్లగూడెం పని ప్రదేశాలను సందర్శించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ అప్పారావుపేటలో నెలరోజుల క్రితం పనులు ఆపేశారని, తిరిగి ఇప్పుడే ప్రారంభిస్తున్నారని తెలిపారు. సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరించాలని, రూ.600 వేతనం ఇవ్వాలని, కుటుంబానికి రెండు వందల రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అందరికీ పని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎడవల్లి శ్రీనివాస్, కట్టా వెంకటరావు, ఆరుగొల్లు వీర వెంకటరావు, మాగంటి సాయమ్మ, పట్టా వెంకటరత్నం, ఎస్‌కె బేబీ పాల్గొన్నారు.
ఆచంట : గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం పోయి నిర్వీర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం విమర్శించారు. మండలంలోని ఆచంట వేమవరం పంచాయతీ పరిధి వేమవరం పెంటలో శుక్రవారం ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు రూ.272 కూలి ఎక్కడా అమలు జరగడం లేదన్నారు. కాలువ బోదెల్లో చెత్త తీయడానికి మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గాజు పెంకులు కాలుకు గుచ్చుకొని గాయాల పాలవుతున్నారని కూలీలు ఆయన వద్ద వాపోయారు. అనంతరం బలరాం మాట్లాడుతూ వ్యవసాయంలో ఆక్వా, రియల్ ఎస్టేట్, యంత్రాలు వచ్చిన తర్వాత పనులు మరింత తగ్గాయన్నారు. వేసవి అలవెన్సులు, మెడికల్ కిట్లు, ప్లే స్లిప్పులు, మజ్జిగ తాగునీరు, టెంట్లు, వేసవి పనిముట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్, సిపిఎం నాయకులు సిర్రా నరసింహమూర్తి, వర్దిపర్తి అంజిబాబు, కొండేటి సత్యనారాయణ, మోహన్‌రావు పాల్గొన్నారు.
పోడూరు : పేదలను కొట్టి పెట్టుబడిదారులకు పెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని సిపిఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్ తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో జగన్నాధపురంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలను కలిసి వారి సమస్యలడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యాసర సరుకుల ధరలకు అనుగుణంగా పూటకు రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు, తానేటి రామకృష్ణ పాల్గొన్నారు.
తణుకురూరల్ : మోడీ కబంధ హస్తాల నుంచి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చినవీరభద్రరావు అన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో వారు మాట్లాడారు. వీరభద్రరావు మాట్లాడతూ ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయకుండా బిజెపి నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కడలి సుబ్బారావు, కొప్పిశెట్టి శ్రీరామ్మూర్తి, దొంగ కొండమ్మ, పిల్లి పద్మ, పొట్ల సత్తిబాబు, తోరం మణి, జుత్తిగ సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుమంట్ర : ఉపాధి పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని కౌలు రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు తెలిపారు. బ్రాహ్మణ చెరువులో పనిచేస్తున్న ఉపాధి కార్మికులను సుబ్బరాజు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు పూటలా పని విధానం రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొంతు శ్రీరామశెట్టి, చదలవాడ చిన్నబ్బులు, కొప్పిశెట్టి సత్యనారాయణ, కె.బేబీ, గంగాభవాని పాల్గొన్నారు.










