Apr 07,2023 18:17

ఎపి వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజాశక్తి - తణుకు రూరల్‌
దేశంలో పేదలకు పనులు చూపి పొట్ట నింపే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇది తగదని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు అన్నారు. ఉపాధి హామీ పనుల పర్యటనలో భాగంగా శుక్రవారం మండలంలోని యర్రాయిచెర్వు గ్రామంలో తాగునీటి చెరువులో పని చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ లెక్క ప్రకారం పని చేస్తున్నా ప్రభుత్వం ప్రకటించిన రూ.272 కూలి రావడం లేదని, కేవలం రూ.140 నుండి రూ.170 మాత్రమే వస్తుందని తెలిపారు. ఈ మండుటెండలో ఎక్కువ సమయం పని చేయలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని, దీంతో కూలీలు ఎక్కువమంది పనిలోకి రావడం లేదని చెప్పారు. పని ప్రదేశానికి కొంతమంది అధికారులు వచ్చినప్పుడు కూలి సొమ్ము బ్యాంక్‌ ఖాతాలో తక్కువగా పడుతున్నాయని చెబితే సదరు అధికారి మట్టి పని చేసుకునే బతికే వాళ్లు.. మీరు చేసేది కలెక్టర్‌ ఉద్యోగం కాదు అని చులకనగా మాట్లాడుతున్నారని కూలీలు వీరభద్రరావు వద్ద వాపోయారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సంపద సృష్టికర్తలైన కూలీలను కించపరుస్తూ సంబంధిత అధికారులు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తక్షణం ఈ వైఖరి మార్చుకోవాలని వీరభద్రరావు అధికారులకు సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పనులు రెండో పూట రద్దు చేయాలని, కూలి రూ.600 ఇవ్వాలని, అడిగిన ప్రతి కుటుంబానికీ రెండొందల రోజులు పని కల్పించి పేస్లిప్‌లు ఇవ్వాలని, చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాలా చినమారయ్య, పాలా దానేశ్వరరావు, పితాని రంగారావు, కడలి ధనలక్ష్మి, వట్టికూటి పద్మావతి, వేండ్ర లక్ష్మి, పితాని ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.