ఉనికి కోసం బలాబలాలు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రెండు పార్టీల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. రానున్న ఎన్నికల్లో ఈ స్థానంలో నువ్వా నేనా అనే తీరులో వారు గొడవ పడ్డారు. బ్యానర్లు చించేశారనే గొడవ చిలిచిలికి గాలీవానగా మారింది. దీనిపై ఇరు గ్రూపులు గొడవలు పడి, రాళ్లు రువ్వుకుని నానా యాగీ చేశారు. దీంతో కిందనున్న కార్యకర్తలకు దెబ్బలు తగిలి ఆసుపత్రుల పాలయ్యారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో చాలా సమస్యలున్నాయి. వీటి గురించి ఈ పార్టీలు పట్టించుకోవడం లేదు గానీ సీటు కోసం బల ప్రదర్శనలు మాత్రం చేస్తున్నాయి.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కుప్పం స్థానంలో మేము బలంగా ఉన్నామని, చంద్రబాబు పని ఇక్కడ ఐపోయిందని, ఆయన ఓడిపోతారని వైసిపి కొంత కాలంగా చెప్పుకుంటోంది. అలాగే 35 ఏళ్లుగా ఉన్న ఈ ప్రాంతం తమకు ఎలాంటి డోకా లేదని, ప్రజాభిమానం ఏ మాత్రం చెక్కు చెదరలేదని టిడిపి చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ స్థానంలో ఎంఎల్‌సి భరత్‌ను ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాకుండా కుప్పంలో గెలిస్తే ఆయనకు మంత్రి పదవిని ఇస్తానని భరోసా ఇచ్చారు. దీంతో కుప్పం రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటనకు రావడంతో బలం నిరూపించుకునేందుకు వైసిపి పావులు కదిపింది. ఇదే స్థాయిలో టిడిపి కూడా ఏ మాత్రం తగ్గేదేలేదు అనే తీరులో దూకుడు ప్రదర్శించింది. ఇరు పార్టీలూ బల నిరూపణ కోసం పొటీపడ్డాయి.
రాజకీయంగా రెండు పార్టీలు ఈ స్థానంలో గొడవ పడుతున్నాయి. ఇక్కడ ప్రజలకు సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతంలో కరువు కరాళనృత్యం చేస్తోంది. బావుల్లో నీళ్లు ఉండడం లేదు. బోర్లు ఇంకిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. ఇక్కడి రైతాంతం బాగుపడాలంటే హంద్రీనీవా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకు రావాల్సిఉంది. అయితే ఈ పనులు మూడేళ్లుగా అక్కడే నిలిచిపోయాయి. సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల హంద్రీనీవా కాలువ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం దీని గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఈ పనులు పూర్తి చేయకుండానే ఎన్నికలకు వెళ్లిపోయారు. దీంతో కుప్పం వాసులకు తాగు, సాగు నీరు లేకుండా పోయింది. ఇక్కడ ప్రతి నిత్యం 20వేల మందికి పైగా ప్రతి రోజూ బెంగుళూరుకు వెళ్లి తిరిగీ సాయంత్రం వస్తున్నారు. సరైన ఉపాధి అవకాశాలు లేకుండాపోవడం వారు పొట్ట చేతపట్టుకుని బెంగుళూరు, చెన్నై, తిరుపతి వంటి ప్రాంతాలకు వసలు పోతున్నారు. స్థానికంగానే ఉపాధి దొరికే అవకాశాలు కల్పించడంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. అయితే సీటు కోసం మాత్రం ఇలా నానా యాగీ చేస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు.










