ప్రజాశక్తి-వెదురు కుప్పం( చిత్తూరు జిల్లా) : సబ్సిడీ పై డ్రిప్ పరికరాలు అందించేందుకు రైతుల నుండి లక్షల్లో డీడీలు తీసుకొని ప్రభుత్వం చేతు లెత్తేసిందని చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చినబాబు విమర్శించారు.వెదురుకుప్పం మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ...చిత్తూరు జిల్లాలో రైతులకు సబ్సిడీ పై డ్రిప్ పరికరాలు ఇచ్చేందుకు రైతుల దగ్గర నుండి 10% నుంచి 30% వరకు డిడిలు తీసుకుని సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా అతీగతి లేదని తెలిపారు.. తెలుగుదేశం ప్రభుత్వంలో 37 కంపెనీల ద్వారా పరికరాలు సకాలంలో రైతులకు సరపరా చేసేవారిని గుర్తు చేశారు.నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో 37 కంపెనీలు స్థానంలో నెటాపియమ్,సిగ్మెట్, నాగార్జున, సుధాకర్ ప్లాస్టిక్ ,సాయిరాం, ఫినోలెక్స్, సుధాకర్ ఇరిగేషన్ ,ఫారగాన్,రుంటా,సిప్లాన్,కొతారి,పోట్లెక్,జైన్ అనే 13 కంపెనీలు తప‌్ప మిగిలిన 24 కంపెనీలు సరఫరా చేయుటకు ముందుకు రాలేదని గుర్తుచేశారు..ఈ కంపెనీల నుండి వేల మందికి పైగా రైతుల దగ్గర నుండి లక్షల్లో డిడిలు తీసుకున్నారని, రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదని వాపోయారు. 37 కంపెనీలలోని వివిధ విభాగాలలో 600 మంది ప్రత్యక్ష ఉద్యోగులు, పరోక్షంగా పైపులు వేయుటకు గాడులు తీయడానికి 2 వేల మంది కూలీలు, పైపులు బిగించడానికి 300 మంది టెక్నీషియన్లు, ప్రభుత్వం తీసుకున్న పనికిమాలిన చర్యల వల్ల వీధిన పడ్డారని తెలిపారు. 37 కంపెనీల స్థానంలో కేవలం 13 కంపెనీలే ఉండడంతో డ్రిప్ పరికరాలు ధరలు నూరు శాతం నుండి 300 శాతం వరకు రేట్లు పెంచేసారని పేర్కొన్నారు. . ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి 13 కంపెనీలతో పాటు మిగిలిన 24 కంపెనీలను చర్చలకు ఆహ్వానించి, సంప్రదింపులు జరిపి రైతులు పంటలు నష్టపోకుండా అలాగే ప్రభుత్వానికి కూడా నష్టం కలగకుండా బిందు,తుంపర సేద‌్యం పరికరాలను రైతులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పక్షాన నిలిచి ఓసారి రైతు బాధను ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు.విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకనాద నాయుడు, మునిరత్నం నాయుడు,రావిళ్ళ లోకనాదం తదితరులు పాల్గొన్నారు.










