అనంతపురం ప్రతినిధి : అనంతపురం నగరంలోని విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ ఉమాపతిది ఆత్మహత్యనా...లేక హత్య అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని దేవరకొండపై కారు దూసుకెళ్లి కిందపడిన ఘటనలో ఉమాపతి మృతి చెందినట్టు వీడియో ఒకటి సోషియల్ మీడయాలో హల్‌చల్ చేస్తోంది. నగరంలోనే ఒక ప్రముఖ విద్యా సంస్థల్లో విద్యానికేతన్ ఒకటి. దీని కరస్పాండెంట్‌గానున్న వ్యక్తి చనిపోవడం నగరంలోనూ పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇంత పేరున్న సంస్థ అధిపతి మృతి చెందడం అనుకోకుండా జరిగిందా.? లేక ఉద్ధేశపూర్వకంగానే ఆయన ఆత్మహత్యకు యత్నించారా..? లేక ఎవరైనా ముందే హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడియోలో చూసినప్పుడు ఆగిన కారు స్టార్టు అవకుండానే దూసుకెళ్లి కిందపడటం కనిపిస్తుంది. కిందపడే సమయంలో ఒక వ్యక్తి సార్...సార్ అంటూ వీడియో రికార్డు చేస్తూనే ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఆ కారును ఆపే ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా కనిపించకపోవడం గమనార్హం. కింద పడిన తరువాత ఉమాపతి కాలిన గాయాలతో చనిపోయినట్టు కనిపిస్తుండటం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఎందుకంటే కారుపై నుంచి కిందపడినప్పుడు కారులో ఎటువంటి మంటలు వ్యాపించలేదు. పైగా పై నుంచి కిందపడిన సమయంలో గాయాలయితే రక్తగాయాలు కావాల్సి ఉంది. ఆయన శరీరంపై పెద్దగా గాయాలు కనిపించకపోవడం చూస్తే ముందే చనిపోయి ఉంటాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు సాధారణ వ్యక్తులతోపాటు, ఆయన సన్నిహితుల్లో కలుగుతున్న అనుమానాలు. కాని కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అయ్యి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రాథమిక సాక్షాల ప్రకారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆయనే అంటించుకుని, శరీరంపై మంటలు వ్యాపించాక డ్రైవర్ పక్క సీట్లలో కూర్చోని హ్యాండ్ బ్రేక్ తీసివేయడంతో కారు కిందకు దూసుకుపోయిందని భావిస్తున్నారు. హత్య కుట్ర కనిపించడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ వాదనలు ఇలాగుంటే ఆస్తి వ్యవహరాల్లో కొంత సమస్యలు కూడా ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. విద్యా సంస్థల అధినేత అయిన ఉమాపతికి అప్పులతోపాటు నగరంలో పలుచోట్ల ఆస్తులున్నాయి ఈ ఆస్తులను కొన్నింటినీ ఇటీవల అమ్మే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే కొన్ని ఆస్తుల విషయంలో రాజకీయ నాయకుల నుంచి సమస్యలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తగాదాలు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఉమాపతి మృతి పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. పోలీసు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి రావన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విచారణకు రాజకీయపరమైన ఒత్తిళ్లు కొన్ని ఉన్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో చనిపోయినట్టుగా చూపించాలని ఒత్తిడి పెంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు దీనిపై దర్యాప్తు ఏమి చేస్తారన్నది చూడాల్సి ఉంది.










