
ప్రజాశక్తి - టెక్కలి రూరల్, ఆమదాలవలస, ఎచ్చెర్ల : విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఈనెల 20వ తేదీ నుంచి చేపట్టే ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ బైక్ యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు కోరారు. టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ 20న విశాఖపట్నంలో ప్రారంభమయ్యే యాత్ర 21న పొందూరు, ఎచ్చెర్ల, ఆమదాలవలసలో సాగుతుందన్నారు. 22న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేటలో ఉంటుందని తెలిపారు. 23న ఇచ్ఛాపురం, పాతపట్నం, కొత్తూరులో సాగుతుందని వివరించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో సుమారు 1200 కిలోమీటర్లు సాగి 29వ తేదీన స్టీల్‌ప్లాంట్ వద్ద చేపడుతున్న నిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుందని చెప్పారు. యాత్ర ముగింపు సందర్భంగా 29న సాయంత్రం ఐదు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్ర ప్రారంభానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ముగింపు సభకు అఖిల భారత నాయకులు హాజరవుతారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే, రాబోయే కాలంలో పెద్దఎత్తున ప్రతిఘటన తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, మెట్రో రైలు, రైల్వేజోన్, విద్యాసంస్థల నిర్మాణం నేటికీ ఆచరణ రూపం దాల్చలేదన్నారు. ఈ దిశలో ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్యపరచడానికి ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. ఆయనతో పాటు సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి జనార్థనరావు, జనవిజ్ఞాన వేదిక ప్రాంతీయ కమిటీ కోశాధికారి కె.షణ్ముఖరావు, సిపిఎం సరుబుజ్జిలి మండల కార్యదర్శి ఎ.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్లలో యాత్ర పోస్టర్‌ను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దుప్పాడ బంగార్రాజు, పట్నాన రామారావు, ఎస్.శ్రీను, ఎ.ధర్మరాజు, ఎం.శివ, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.