Sep 27,2023 22:56

ప్రతులను దహనం చేస్తున్న ఉపాధ్యాయులు

* జిపిఎస్‌ బిల్లు ప్రతుల దహనం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌, కొత్తూరు, సోంపేట: 
ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జిపిఎస్‌ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి ఆశలను చిదిమేసిందని, బుధవారం ఉద్యోగులకు చీకటి రోజు అని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్‌.కిశోర్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం నగరంలోని డే అండ్‌ నైట్‌ కూడలి, కొత్తూరు మండలంలోని మెట్టూరు, సోంపేటలోని ఎంఆర్‌సి భవనం వద్ద జిపిఎస్‌ బిల్లు ప్రతులను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిపిఎస్‌ వద్దని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం సరికాదన్నారు. గ్యారెంటీ లేని పెన్షన్‌ స్కీమ్‌కు గ్యారంటీ పెన్షన్‌ అని పేరు పెట్టడం తమను మోసం చేయడమేనన్నారు. కంట్రిబ్యూషన్‌ కట్టించుకునే విధానం ఆదర్శం ఎలా అవుతుందని ప్రశ్నించారు. భవిష్యత్తులో పాత పెన్షన్‌ సాధించడం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అందుకు తగిన ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. అధికారంలోకి రాక ముందు జగన్‌ సిపిఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత సిపిఎస్‌ రద్దు చేయకుండా గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ పేరుతో మరో మోసానికి తెరలేపారని ధ్వజమెత్తారు. పాత పెన్షన్‌ విధానం తప్ప మరేదీ ఆమోదించేది లేదని తేల్చిచెప్పారు. గత పిఆర్‌సిలో అంకెల గారడీ చేసిన జగన్‌ ప్రభుత్వం అదే రీతిలో జిపిఎస్‌ విధానంలో అవలంభిస్తోందన్నారు. విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించి ఒపిఎస్‌ సాధించే వరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు హెచ్‌.అన్నాజీరావు, పి.సూర్యప్రకాశరావు, జి.సురేష్‌, వై.ఉమాశంకర్‌, డి.ప్రకాశరావు, కె.విజరుకుమార్‌, ఎల్‌.బాబూరావు, జి.రాజేష్‌, బి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.