అనంతపురం కలెక్టరేట్ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ఏపీ జెఎసి అమరావతి నాయకులు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్ ఆర్‌ఎన్.దివాకర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్.ఖాన్ ఆధ్వర్యంలో శనివారం నాడు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు మద్దతుగా హాజరయ్యారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, సిఐటియు నగర కార్యదర్శి వై.వెంకటనారాయణ, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, జిల్లా అధ్యక్షులు రాజేష్‌గౌడ్, మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీధర్, టైపిస్ట్, స్టెనోగ్రఫీల అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, పశుసంవత్సర్ధక శాఖ ఉద్యోగుల యూనియన్ శ్రీనివాసులు, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కోశాధికారి మారుతి ప్రసాద్‌రెడ్డి, విఆర్‌ఒల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనరసయ్య, మైనర్ ఇరిగేషన్ శాఖ ఉద్యోగుల యూనియన్ రామకృష్ణ, అనిల్, శివ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యూనియన్ నాయకులు మద్దతుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెఎసి అమరావతి జిల్లా ఛైర్మన్ దివాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పిఎస్.ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది మంచిది కాదన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందులో పని చేసే ఉద్యోగులను పట్టించుకోకపోవడం విచాకరం అన్నారు. మొదటి దశలో నియామించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల 9 నెలల కాలానికి బకాయిలు, రెండో విడతలో నియామకం అయిన ఉద్యోగుల 5 నెలల కాలానికి బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సాధారణ బదిలీలు వెంటనే చేపట్టాలన్నారు. రోజువారి నిర్ధేశించిన పౌర సేవలు లక్ష్యాలు, పని ఒత్తిడి తగ్గించాలన్నారు. రూరల్ నుంచి అర్భన్‌కు విలీనం అయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్, సీనియార్టీకి సబంధించిన అంశాలు మార్గదర్శకాలు తయారు చేయాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ డిస్కమ్ ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎపిజిఎల్‌ఐ బాండ్లు వెంటనే జారీ చేయాలన్నారు. వార్డ్ శానిటేషన్ ఎన్వీరాన్‌మెంట్ కార్యదర్శులకు మేస్త్రీ విధులు నుంచి విముక్తి కలిగించాలన్నారు. ఇహెచ్‌ఎస్ కార్డులు వెంటనే జారీ చేయాలన్నారు. ఎఎన్‌ఎంల మీద యాప్‌ల భారం తగ్గించాలన్నారు. మహిళా కార్యదర్శులకు బందోబస్తు డ్యూటీలు కేటాయించరాదన్నారు. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు జీవో 149 అమలు చేసి డిడిఒ అధికారాలు కల్పించాలన్నారు. గ్రేడ్-2 విఆర్‌ఒలకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్స్, వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్, ఎనర్జీ అసిస్టెంట్‌లకు ఉద్యోగోన్నతి ఛానల్స్ కల్పించాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి ఫ్రంట్ ఆఫీస్ డ్యూటీని సచివాలయంలోని అందరూ ఫంక్షనరీస్‌లో నిర్వహించేలా చేయాలన్నారు. సిపిటి పరీక్ష వల్ల ప్రొబేషన్ పూర్తి కాని గ్రేడ్ 2, విఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్ 5 వారికి వెంటనే సిపిటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఆర్గనైజేషన్ సెక్రటరీ సల్మాన్ బాషా, అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, క్లాస్‌ఫోర్త్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, గ్రామ వార్డ్ సచివాలయల డివిజన్ అసోసియేషన్ మైలరప్ప, వెంకట రాఘవ, వినరు, కులశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.










