ఉరవకొండ : ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడితే ప్రభుత్వ పతనం తప్పదని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఎపి ఉద్యోగుల సంఘం ఉరవకొండ తాలూకా అధ్యక్షులు వసికేరి మహేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టగా తహశీల్దార్ షాబుద్దీన్, ఎంపీడీవో చంద్రమౌళి, సబ్ ట్రెజరీ ఆఫీసర్ నాగేంద్ర, ఏపీటీఎఫ్ నాయకులు హనుమప్ప, సాకే భాస్కర్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జిల్లా ఉపాధ్యక్షులు హనుమంత్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్ల సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా జీతాలు ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాల న్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతభత్యాలు చెల్లించేలా ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎంఆర్ డైలీ వేజెస్ కంటెంజెంట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలన్నారు. అన్ని శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. బకాయిలు, డిఎ, అరియర్స్‌ను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు భద్రత కల్పించాలని, పదవీ విరమణ చేసిన రోజునే ఉద్యోగులకు అన్ని ఆర్థిక ప్రయోజనాలను అందించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను సమావేశపరిచి చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయకపోతే ఎపి ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎర్రిస్వామి, ట్రెజరర్ శివయ్య, వైస్ ప్రెసిడెంట్ తిరుపాల్ నాయక్, జాయింట్ సెక్రటరీలు, విఆర్వో, విఆర్‌ఎ సంఘాల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అహ్మద్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.










