Dec 15,2022 22:38

ఉద్యోగాలు కోల్పోయిన హోంగార్డులతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

ఉద్యోగాలు కోల్పోయిన హోంగార్డులకు ప్రాధాన్యత
జిల్లా ఎస్పీ రిశాంత్‌ రెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
హోంగార్డ్‌ పోస్టుల భర్తీలో నకిలీ డీఓలతో మోసపోయి ఉద్యోగం కోల్పోయిన 87మంది హోంగార్డ్స్‌కు అధికప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి తెలిపారు. 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్యకాలంలో సుమారు 87మంది నకిలీ డీఓల ద్వారా హోంగార్డ్స్‌గా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న వారిని విధుల నుంచి తొలగించిన విషయం విధితమే. ఈ అక్రమనియామకాలపై జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీస్‌ ఉన్నతాధికారులు నకిలి డీఓలు సష్టించి వారిని హోంగార్డ్స్‌ ఉద్యోగంలో చేర్పించిన ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి ఉద్యోగం కోల్పోయిన 87మంది హోంగార్డ్స్‌తో చిత్తూరు ఆర్మ్డ్‌ రిజర్వు, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సమావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగం కోల్పోవడం చాలాభాదాకరమైన విషయమని మీతోపాటు మీ కుటుంబం కూడా తెలియనిస్థితిలో ఉంటారని, ఇటువంటి సమయంలోనే మీరు మీ కుటుంబసభ్యులు అధైర్య పడకుండా ఉండాలని కోరారు. ఉద్యోగాల గురించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ ప్రభుత్వంతో చర్చించి ఖాళీ అయిన పోస్టులభర్తీకి నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల అయ్యేలా చూస్తామని, హోంగార్డ్‌ పోస్టుల ఎంపికలో అధిక ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్‌, ఎస్‌ఐ నియామకాలను విడుదల చేసిందని 34 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. హోంగార్డులను వారి ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకొని త్వరలోనే పరిష్కారం చూపుతామని జిల్లాపోలీస్‌ యంత్రాంగం మీకు ఏ సమయంలోనైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇటువంటివి ఇకపై జరగకుండా, దళారులచేతిలో ఎవరు మోసపోకుండా తగినచర్యలు చేపడతామని, ఎవరైనా మీకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ ఉద్యోగంలో చేర్పిస్తామని డబ్బులు అడిగితే వెంటనే డయల్‌100కు లేదా పోలీస్‌ వాట్సాప్‌ నెంబర్‌ 94409 00005కు తెలుపవలెనని తెలియజేశారు. ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడితే వారిపై చట్టపరమైనచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.