అనంతపురం : ఉద్యోగాలను అభ్యర్థించడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం నాడు రాప్తాడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ''జగనన్న ఆణిముత్యాలు'' పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్ చదివి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకుని సమాజం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి విద్యార్థీ విషయ పరిజ్ఞానం మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాల్మన్ రాజ్, మండల వైసీపీ కన్వీనర్ శేఖర్, జడ్పీటీసీ హేమలతతో పాటు మండల ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










