ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తుతాం..!
పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి
ప్రజాశక్తి - తిరుపతి సిటీ
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై శాసనమండలిలో గళమెత్తి, వాటి పరిష్కారానికి పోరాడతామని పిడిఎఫ్ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. తిరుపతి యశోదనగర్‌లోని ఎంబి భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఒకపక్క నిరుద్యోగం పెరుగుతోందని, మరోపక్క డిగ్రీలు చేతబట్టిన యువతకు ఉపాధి లేదన్నారు. ఉద్యోగుల సంఖ్యను పెంచకపోగా, ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొట్టేలా పాలకుల చేష్టలు ఉండటం బాధాకరమన్నారు. పిఆర్సి విడుదల విషయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదని, సిపిఎస్ రద్దు హామీ అటక ఎక్కిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక విభాగాల్లో ఖాళీ పోస్టులు కోకొల్లలుగా ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు పూనుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ నాయకులు మునిరామయ్య, డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, రామకష్ణ, మాధవ్ పాల్గొన్నారు.










