ఉద్యోగ సమస్యలపై ఎస్‌డబ్ల్యుఎఫ్ నిరసన
ప్రజాశక్తి-ఉదయగిరి : ఆర్‌టిసి ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వాటిపై ఎస్‌డబ్ల్యుఎఫ్ అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళవారం స్థానిక డిపో ఎదుట కార్మికులతో నిరసన చేపట్టి వారు మాట్లాడారు. ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా తయారైందని ఉద్యోగులకు ఎంతోకొంత రక్షణగా ఉన్న 1/2019 సర్క్యులర్‌ను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం జారీచేసిన రెగ్యులేషన్ వల్ల ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రెగ్యులేషన్ పేరుతో జి.ఒ. నెంబర్ 70, 71 పేరుతో 1963 నాటి బానిస రెగ్యులైజేషన్‌లను అమలు చేయాలని చూస్తూ కార్మికులపై హుకుం జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జి.ఒ. నెంబర్ 70, 71లను రద్దు చేసి 1/2019 సర్క్యులర్‌ను అమలు చేయాలన్నారు. ఆర్థిక బకాయిలు అనేక సంవత్సరాల పెండింగ్‌లో ఉన్న ఆర్‌పిఎస్ 2017 బకాయిలు, ఎస్‌ఆర్‌బిఎస్, ఎస్‌బిటి 2020 నుండి రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. డిపోలో ఉద్యోగులు అనేక సమస్యలతో విధులు నిర్వర్తిస్తూ నిత్యం కెఎంపిఎల్ వేధింపులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఎర్నింగ్ సెక్షన్‌లో డ్రైవర్, కండెక్టర్లు కూర్చోవడానికి లేకుండా ఉన్న బెంచీని తీసివేశారు. చిన్న చిన్న డ్యామేజీలకు ఛార్జ్‌షీట్లు ఇచ్చి రికవరీ చేస్తున్నారని దీర్ఘకాలంగా ఎడిసిలు లేక కండక్టర్ ఒడిల వల్ల ఎడిసిలకు, కండక్టర్లకు లీవు పొజీషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్యారేజీలో నాణ్యమైన టూల్స్, స్పేర్‌పార్టులు అందించడం లేదన్నారు. నాసిరకమైన స్పేర్‌పార్టులను వినియోగించడం వల్ల లైన్లో బస్సులు ఆగితే మెకానిక్‌లను బాధ్యులను చేయడం మానుకోవాలని, వారిపై వేధింపులు ఆపాలని పైసమస్యల పరిష్కారానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో డిపో అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










